Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ-ములుగు
ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ఫారెస్ట్ అధికారులు వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య తెలిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీ, ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీ ప్రాంతాల్లో పోడు రైతులకు ఫారెస్ట్ అధికారులు సమస్య అర్థమయ్యేలా వివరించాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే గ్రామ సభల ద్వారా తెలిపి పరిష్కరించేలా చూడాలని ఫారెస్ట్ బీట్, రేంజ్ అధికారులను ఆదేశించారు. రోఫర్ ఆక్ట్ ప్రకారం గెజిట్, జీఓ ననుసరించి ప్రణాళికా బద్దంగా రికార్డ్స్ సిద్ధం చేసుకోవాలని అన్నారు. తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్సై, సంబంధిత అధికారులు టీమ్‌గా పనిచేయాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. జిల్లా లో హరిత హారం లో భాగంగా అడవుల్ని పెంపొందించుకోవడానికి పల్లె ప్రకృతి వనాలు ఉపయోగపడుతాయని అన్నారు. పర్యావరణ కాలుష్యం నివారించేందుకు అడవుల అభివృద్ధే లక్ష్యంగా అటవీశాఖ అధికారులు పని చేయాలని అన్నారు. అనంతరం ఐటీడీఏ పీఓ హన్మంతు కె జడంగే మాట్లాడుతూ ఫారెస్ట్ భూముల విషయంలో ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని, ప్రజలకు ముందు సమాచారం తో గ్రామ సభల ద్వారా సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారులు ప్రతి పనిలో రికార్డ్ తయారు చేసుకోవాలన్నారు. అవసరమైతే వీడియో రికార్డ్ చేస్తే బాగుంటుందని అన్నారు. జిల్లా ఫారెస్ట్ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. జిల్లాస్థాయి కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి రమాదేవి, ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ వేణుగోపాల్, వీణావాణి, ఆర్ అండ్ బి ఇ.ఇ వెంకటేష్, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి ఏర్రయ్య, జెడ్పీటీసీలు రమణ, నాగ జ్యోతి పాల్గొన్నారు.