Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మృతి మండలానికి తీరని లోటని రైతుబంధు జిల్లా సభ్యుడు పచ్చా శేషగిరిరావు, ఆత్మ మాజీ చైర్మెన్లు పగిడిపల్లి వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ, రైతుబంధు మండల కన్వీనర్ సామ మోహన్ రెడ్డి, సొసైటీ చైర్మెనర్ తోట రమేష్, జిల్లా సీనియర్ నాయకుడు వత్సవాయి శ్రీధర్ వర్మ, వికాస్ అగ్రీ ఫౌండేషన్ చైర్మెన్, తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని కమలాపురం అమరవీరుల స్థూపం వద్ద సంతాపసభ ఏర్పాటు చేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ములుగు ఎమ్మెల్యేగా గిరిజన, దళిత, బడుగు, బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలు మర్చి పోలేనివని అన్నారు. భౌతికంగా ఆయన దూరమైనప్పటికీ అణగారిన ప్రజల గుండెల్లో చందూలాల్ ఎప్పటికీ నిలిచి పోతారని కొనియాడారు. అనంతరం చందూలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గోవిందరావుపేట : మహానేత చందూలాల్ కు మండల ప్రజానీకం ఘన నివాళులు అర్పించింది. శుక్రవారం మండల కేంద్రంలో చందూలాల్ మరణించిన సందర్భంగా మండల అధ్యక్షుడు మురహరి బిక్షపతి, ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయన చిత్ర పటానికి పులా మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. మూడుపర్యాయాలు శాశన సభ్యులుగా, రెండు సార్లు ఉమ్మడి వరంగల్ జిల్లా పార్లమెంట్ సభ్యుడుగా ,గిరిజనుల అభివద్ధి కోసం ట్రైకార్ చైర్మన్ గా ఎన్నో పదవులు అధిరోహించినట్టు గుర్తు చేశారు. జిల్లా అభివృద్ధి, ఏర్పాటులో చందూలాల్ ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. ఎంపీటీసీ ఆలూరి శ్రీనివాసరావు, వెలిశాల స్వరూప, కోఆప్షన్ సభ్యులు బాబర్, పీఏసీఎస్ డైరెక్టర్ సూదిరెడ్డి లక్ష్మారెడ్డి, అధికార ప్రతినిధి సురనేని సాయిబాబు, ఉపాధ్యక్షుడు రాజన్ననాయక్, ఉదరు భాస్కర్, సీనియర్ నాయకులు దేవనాయక్, హేమాద్రి, మచినేని బాబురావు, గ్రామ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.