Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల హామీలు తుంగలో తొక్కారు
- జిల్లావ్యాప్తంగా 19 రోజుల పాటు
- 400 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగించాం
- అనేక సమస్యలు ప్రజలు విన్నవించారు
- నేడు జిల్లా కేంద్రంలో ముగింపు సభ
- హాజరుకానున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ నాయకులు
- నవతెలంగాణతో పాదయాత్ర రథసారధి బంధు సాయిలు
నవతెలంగాణ-భూపాలపల్లి
''కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకొచ్చి ప్రజాసమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారు. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి జిల్లాలో పాదయాత్ర నిర్వహించాం. జిల్లా సమగ్ర అభివృద్దికి గత నెల 30 నుంచి నేటి వరకు 11 మండలాలు 125 గ్రామాలు 400 కిలోమీటర్లు 19 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించాం. ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతోపాటు పలు సమస్యలు పాదయాత్ర బృందానికి వెల్లువెత్తాయి. పాదయాత్ర ముగింపు సభ నేడు జిల్లా కేంద్రంలోని అంగడి మైదానంలో జరగునుంది. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ నాయకులు హాజరు కానున్నారు. విజయవంతం చేయాలి. కాగా మహా ముత్తారం మండలం లో ప్రారంభమైన పాదయాత్ర పలిమెల, మహాదేవ పూర్, కాటారం, మల్హర్ ,టేకుమట్ల, మొగుళ్లపల్లి, చిట్యాల, రేగొండ, గన్ పూర్, మీదుగా భూపాలపల్లిలో ముగింపు జరగనుంది.'' అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శిచ పాదయాత్ర రథసారధి బందు సాయిలు వివరించారు. ముగింపు సభ నేపథ్యంలో ఆయన నవతెలంగాణతో పాదయాత్ర విశేషాలు వివరించారు.
ఇట్టి రకం సీడ్స్ కంపెనీతో మోసపోయిన రైతులు
ప్రధానంగా కాటారం మండల లోని గూడూరు శివారులో 15 మంది కౌలు రైతులు, ఐదుగురు రైతులు ఇట్టి రకం సీడ్స్ కంపెనీ మాయ మాటలు నమ్మి 60 ఎకరాల్లో వరి సాగుచేశారు. ఎకరానికి 15 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని, క్వింటాకు రూ.7500 ఇస్తామని కంపెనీ ఏజెంట్లు చెప్పగా రెండు క్వింటాళ్ల దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. ఎకరం కౌలు రూ.15వేలు, పెట్టుబడి కలిపి మొత్తంగా రూ.75 వేలు ఖర్చు చేశారు. నేడు కనీసం పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. దీంతో రైతు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొంది. గూడూరు శివారులో రైతులందరు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల పెట్టుబడి పెట్టారు. సదరు కంపెనీ ఎలాంటి సహకారం అందించకుండా ముఖం చాటేస్తోంది. ప్రభుత్వం స్పందించి వీఎన్ఆర్-6ఎల్ కంపెనీ రిజిస్ట్రేషన్ రద్దు చేసి క్రిమినల్ కేసులు పెట్టాలి. ఎకరానికి రూ.2లక్షల నష్టపరిహారం చెల్లించాలి. లేదంటే సమరశీల పోరాటాలు నిర్వహిస్తాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రైతు వ్యవసాయ శాఖలో కాంట్రాక్ట్ వ్యవసాయం వల్ల భవిష్యత్‌లో ఇలాంటి కంపెనీల చేతుల్లోకి రైతుల జీవితాల్లో వెళ్లి నష్టపోయే ప్రమాదం ఎక్కువ ఉంది. అందుకే రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలి
జిల్లాలో చలి వాగు, మొరంచ వాగు, మానేరు వాగు, కనుక నూరు, వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి రైతులకు మూడు పంటలకు సరిపడా సాగు, తాగునీరందించాలి. కొంపల్లి, నైన్ పాక, కొరికిశాల ఇప్పలపల్లి, కనుకనూరు, ముకునూరు, బోర్నపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణాలు చేపడితే రాకపోకలు సులువుగా ఉంటాయి. మొగుళ్లపల్లి మండలం నుంచి రంగాపురం వరకు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే నష్టపరిహారం ఇవ్వకుండానే రోడ్లకు టెండర్లు వేశారు. చిట్యాల మండలం శాంతినగర్‌లో ఐరన్ ఓర్ ఉన్నందున ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. వితంతువులు, ఒంటరి మహిళలు పింఛను రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలు పరిష్కరించాలి. జిల్లావ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు.
తాగునీరు లేక అల్లాడుతున్న ప్రజలు
కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని ప్రభుత్వ చెప్పినా మేడిగడ్డ, అన్నారం దేవాదుల పరిసర పరివాహక ప్రాంతంలో తాగునీరు లేక ప్రజలు, సాగునీరు లేక రైతులు ఇబ్బందులుపడుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక తరలింపు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నిండుతోందే తప్ప మరేదీ లేదు. బోర్లు అడుగంటి పోతున్నాయి. జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఉంది. జెన్కో ఆనుకొని ఉన్న దుబ్బపల్లి గ్రామం బూడిద మూలంగా అనారోగ్యాలకు గురవుతున్నారు. ఆ గ్రామాన్ని తరలించాలని పలుమారు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు. సింగరేణి, జెన్కో, మేడిగడ్డ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం అందించాలని,ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నార. బొగ్గు గని కార్మికులకు ఆదాయపు పన్ను రద్దు చేయాలని, కాంట్రాక్టు కార్మికులకు కోల్ ఇండియా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అసంఘటిత కార్మికులకు పెరిగిన ధరలకనుగుణంగా రూ.21వేలు వేతనం చెల్లించాలి. రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలి. భూపాలపల్లిలో బొగ్గు సిమెంట్ కర్మాగారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
పూర్తి స్థాయి అధికారుల నియామకంలో విఫలం
పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకనుగుణంగా అధికారులను నియమించడంలో ప్రభుత్వం విఫలమైంది. జిల్లా కేంద్రంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం తో పాటు లేబర్ కార్యాలయం మున్సిఫ్ కోర్టు, ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలి. జిల్లా కేంద్రానికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు వంద పడకల ఆసుపత్రి ప్రారంభించనున్నారుజ వరంగల్ అర్బన్ జిల్లా ఉప్పల్ నుంచి భూపాలపల్లి మీదుగా ఇల్లందు వరకు రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది.
జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు కేటాయించాలి
కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరికి పది కేజీల బియ్యం అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని కరోనా వైద్యం అందించాల్సి ఉంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్న విలేకరులకు ఇండ్ల స్థలాల తోపాటు ఇండ్లు నిర్మించివ్వాలి. జిల్లా వ్యాప్తంగా పోడు భూములకు, అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలి. జిల్లాలో పూర్తైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు పంచాలి. అర్హులైన వారందరికీ ఇండ్లు పంపిణీ చేయాలి. రైతులకు రుణ మాఫీ చేయాలి. కౌలు రైతులకు రైతుబంధు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మేడిగడ్డ దేవాదుల ప్రాజెక్టు నుండి ఇతర జిల్లాలకు కాకుండా స్థానిక చెరువులు, కుంటలు నింపాలి. పలు గ్రామాల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు సైడు కాలువలు నిర్వహించాల్సి ఉంది. అయినా ప్రభుత్వం పట్టించుకోరని పరిస్థితి. ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. కాటారం మండలం లోని మేడిపల్లి వద్ద నిర్మించే టోల్‌గేట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వాలు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. వీటితోపాటు అనేక సమస్యలు మా పాదయాత్ర బృందానికి వచ్చాయి. నేడు ముగింపు సభ తర్వాత మరో రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి సమాయత్తం అవుతాం. భవిష్యత్తులో జరిగే పోరాటాలకు ప్రజలు సన్నద్ధం కావాలి.
నిరుద్యోగ భృతి అందించాలి- పి వినయ్, పాదయాత్ర బృందం సభ్యులు
యువత ఉపాధి లేక వందరోజుల పనికి వెళ్తున్నారు. పీజీ, డిగ్రీ, ఎంబీఏ, పీహెచ్డీ చేసిన వారు ఏడేండ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగా లేక తల్లిదండ్రులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వెంటనే ఖాళీల ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలి. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి.
కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి - నాగుల అరవింద్, పాదయాత్ర బృందం సభ్యులు
ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలి. విద్యారంగానికి రెండు వందల కోట్లు కేటాయించాలి. జిల్లా వ్యాప్తంగా 11 కస్తూర్బా పాఠశాలలు, రెండు సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు ఒకటి బిసి వెల్ఫేర్ 1 మైనార్టీ వెల్ఫేర్, 6 ఆశ్రమ పాఠశాలలు కొనసాగుతున్నాయి. సొంత భవనాలు నిర్మించాలి. శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మించాలి. అటెండర్, స్లీపర్స్‌ను నియమించాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి.
మంచినీటి సమస్య పరిష్కరించడంలో విఫలం - పొలం రాజేందర్ పాదయాత్ర బందం సభ్యులు
మంథని నియోజక వర్గం సింగారం స్తంభంపెల్లి, కనుకనూరు, పోలంపల్లి ముత్తారం, నిమ్మ గూడెం గ్రామాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. వాగుల నుండి చెలిమెల ద్వారా నీటిని తోడుకొని తాగుతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. పోడు చేసుకున్న రైతులు బోర్లు వేసుకుంటే ఫారెస్ట్ అధికారులు అడ్డుకో వడంతో పంట నష్టం జరుగుతోంది. రైతుబంధు, బీమా అందడం లేదు. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణాలు అందించాలి. మహాదేవపూర్ కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలి.
పశువుల కొట్టాలుగా పాఠశాలలు - ఏ శ్రీకాంత్, పాదయాత్ర బృందం సభ్యులు
గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు పశువుల కొట్టాలుగా మారాయి. ఏడాదిగా పాఠశాలలు మూతపడడంతో కొన్ని పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఆన్లైన్ క్లాసుల తో అటవీ ప్రాంతాలైన కిష్టాపూర్, మద్దిమడుగు ముకునూరు, నీలంపల్లి, రెడ్డిగూడెం, కనుక నూరు మంచన్‌పల్లి, నీలంపల్లి గ్రామాల్లో ఉన్న మూడు వేల మంది విద్యార్థులు విద్యుత్, సెల్ ఫోన్ టవర్ లేక ఇబ్బందులు పడుతున్నారు.
అగ్రవర్ణాల వేధింపులకు అడ్డుకట్ట లేదు- గుర్రం దేవేందర్, బృందం సభ్యులు
జిల్లాలో అగ్రవర్ణాల వేధింపులకు అడ్డుకట్ట లేకుండా పోయింది. మల్హర్రావు మండలం మల్లారం గ్రామానికి చెందిన రాజబాబు ముత్తారం మండలానికి చెందిన కవిరాజు వర్ణాల చేతిలో హతమయ్యారు. కంసాన్పల్లి లో లక్ష్మి ఆత్మహత్య చేసుకుంది.
ఫారెస్ట్ అధికారుల దాడులు అమానుషం- సూదుల శంకర్ పాదయాత్ర బందం సభ్యులు
పలు గ్రామాల్లో 20వేల ఎకరాలు 20 సంవత్సరాలుగా ఆదివాసీ పోడుదారులు సాగులో ఉంటున్నారు. ఏటా ఫారెస్టు అధికారులు భూముల వద్దకు వచ్చి వారిని కొట్టిన సంఘటనలు మా దృష్టికి వచ్చాయి. కొన్ని భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో దళిత గిరిజనులు వేసుకున్న ఇండ్లను కూల్చివేశారు. నేటికి ఫారెస్ట్ అధికారుల దాడులు ఆగడం లేదు.
గొత్తికోయలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలి - బుధరం పాదయాత్ర బందం సభ్యుల
మద్దిమడుగు, సింగారం దూదేకులపల్లి గొల్ల. బుద్ధారం గ్రామాల్లో మొత్తం 200 కుటుంబాలు ఆవాసం ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నాయి. వీరందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలి. తునికాకు రూ.5 చెల్లించాలి. గూడెంలో తాగునీటి వసతి కరెంటు సౌకర్యం కల్పించాలి. వందరోజుల పని కల్పించాలి. ఇప్పటికే అధికారులు వీరిని తరలించే ప్రయత్నం మానుకుని వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలి
ఇచ్చిన హామీలు నెరవేర్చాలి- దామర కిరణ్ పాదయాత్ర బృందం సభ్యులు
జిల్లా కేంద్రంలో గతేడాది జనవరి లో మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. భూపాలపల్లి పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్, భూపాలపల్లికి నాలుగువైపులా స్మశాన వాటికలు, భూపాలపల్లి పట్టణానికి సమగ్ర మాస్టర్ ప్లాన్ అమలు, ప్రభుత్వ సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న ప్రతి పేదవాడికి ఇండ్ల పట్టాలు అందజేయాలి. కూరగాయల మార్కెట్ ఎర్ర చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేయలేదు. భూపాలపల్లి పట్టణ ప్రజలందరికీ ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజనం అందించాలి. 8 ఇంక్లైన్ పరిసర ప్రాంతాలను మున్సిపాలిటీ లో కలిపి పనిచేసే సింగరేణి కార్మికులకు 10 శాతం హెచ్ఆర్ వర్తించే విధంగా చేయలేదు.తదితర హామీల అమలులో విఫలమవుతున్న పరిస్థితి.