Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మావోయిస్టు అధికారి ప్రతినిధి జగన్
నవతెలంగాణ-వరంగల్
ప్రహార్ సైనిక దాడులకు నిరసనగా ఏప్రిల్ 26న భారత్ బంద్‌లో భాగంగా అన్ని వర్గాల ప్రజలు బంద్‌ను విజయవంతం చేయాలని, 'ఆపరేషన్ ప్రహార్'ను ఓడించాలని సిపిఐ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. శుక్రవారం ఈ మేరకు జగన్ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. దేశంలో బిజెపి మోదీ ప్రభుత్వం బ్రాహ్మణీయ హిందూ రాజ్యస్థాపన లక్ష్యంతో మావోయిస్టులు లేని నయాభారత్ను నిర్మిస్తామంటూ మోదీ, అమిత్‌షాలు ప్రకటనలు చేస్తున్నారన్నారు. రైతాంగాన్ని పూర్తిగా లూటీ చేయడానికి అదాని, అంబానీ సామ్రాజ్యవాద కార్పొరేట్ల లాభాల కోసం ప్రమాదకర నూతన వ్యవసాయ చట్టాలను ఆమోదించడంతో భారత రైతాంగం ఉవ్వెత్తున లేచి పోరాడుతుందన్నారు. ఈ పోరులో ఇప్పటి వరకు 300 మందికిపైగా రైతులు మృతిచెందారన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తామని ప్రకటించారని, దేశంలోని మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తామని బహిరంగంగా ప్రకటించిందన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం, ఓసీలు, అభయారణ్యాలు, ధరణి పోర్టల్‌ల పేరుతో ఆదివాసుల, పీడిత ప్రజల భూములను ఆక్రమిస్తూ కార్పొరేట్లకు అప్పగిస్తున్నారన్నారు. ప్రజలను, మావోయిస్టు పార్టీని అణిచివేయడానికి సమాధాన్ బహుముఖ దాడి-ప్రహార్ సైనిక దాడిని కొనసాగిస్తున్నారన్నారు. గ్రేహౌండ్, పారా మిలటరీ బలగాల ద్వారా ఎడతెరిపి లేకుండా కూంబింగ్ కొనసాగిస్తున్నారన్నారు. బూటకపు ఎన్కౌంటర్లలో హత్యలు, అరెస్టులు, జైళ్లలో చిత్రహింసలు, విషప్రయోగాలు, దుష్ప్రచారాలు అనేక రకాల అణచివేత పద్దతులను అమలు చేస్తున్నారన్నారు. కేంద్రంలో మోదీ బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో టిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం కొనసాగిస్తున్న ఫాసిస్టు ఆపరేషన్ ప్రహార్ సైనికదాడికి వ్యతిరేకంగా ఏప్రిల్ 26న భారత్‌బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు.