Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కదులుతున్న 'మేయర్' పీఠం
నవతెలంగాణ-వరంగల్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిపై టీఆర్ఎస్లో ఆధిపత్య పోరు కొనసాగుతోుంది. గ్రేటర్ హైద్రాబాద్‌లో టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిని ముందుగా ప్రకటించలేదు. ఎన్నికలయ్యాక, ఫలితాలు వచ్చాక మేయర్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాకనే సీల్డ్ కవర్‌ను పంపి మేయర్ అభ్యర్థిని ఎంపిక చేశారు. అలాంటిది గ్రేటర్ వరంగల్ నగరంలో మేయర్ అభ్యర్థిని ఇంత ముందుగా ఎలా ప్రకటిస్తారనే విషయంలో టీఆర్ఎస్ నేతల్లో సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఒక వర్గం మేయర్ అభ్యర్థి గుండు సుధారాణి అని వాదిస్తుంటే, మరో వర్గం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తోంది. ఏది ఏమైనా మేయర్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వ్ కావడం, ఈ పదవి ఎవరికి దక్కాలో అగ్రవర్ణాలే డిసైడ్ చేయడం పట్ల బీసీ తరగతుల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. వరంగల్ మేయర్ పదవికి వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి గుండేటి నరేంద్రకుమార్, దిడ్డి కుమారస్వామి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి గుండు సుధారాణి పోటీ పడుతున్నారు. మేయర్ పీఠంపై టీఆర్ఎస్లో పీఠముడి పడేట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా ఎన్నికలై ఫలితాలు వస్తేనే తేలే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
గ్రేటర్ వరంగల్ నగర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై పీఠముడి పడింది. అధికార టీఆర్ఎస్లో ఆధిపత్య పోరు పరాకాష్టకు చేరుకుంది. నగర ఎమ్మెల్యేలు ఒక పక్కుంటే, మంత్రులు మరో పక్కునున్నారు. మేయర్ ఎంపిక టీఆర్ఎస్లో హాట్ టాపిక్‌గా మారింది. గ్రేటర్ వరంగల్ మేయర్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వ్ కాగా ఈ స్థానంపై పలువురు అభ్యర్థులు ఆశలు పెంచుకున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ నుంచి కీలక పాత్ర పోషించిన గుండేటి నరేంద్రకుమార్ ముందు వరుసలో ఉన్నారు. కార్పొరేషన్లో నరేంద్రకుమార్ గతంలో టీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్‌గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ 'గుండేటి'కి మద్దతుగా పావులు కదిపారు. ఇది జీర్ణించుకోలేని పలువురు నేతలు దీనికి వ్యతిరేకంగా గుండు సుధారాణి పేరును తెరపైకి తీసుకొచ్చారు. ఈ విషయంలో వెంటనే పలువురు నేతలు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్‌కుమార్‌ను సంప్రదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ క్రమంలో వారిచ్చిన వివరణ మేరకే 'గుండేటి' రంగంలోకి దిగినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
'గుండేటి'ని అడ్డుకునే ప్రయత్నం..
తెలంగాణ ఉద్యమంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించి నాడు కార్పొరేటర్‌గా ఎన్నికై వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్‌గా వ్యవహరించిన కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన గుండేటి నరేంద్రకుమార్‌కు పార్టీ టికెట్ ఇవ్వడానికి కూడా పలువురు కీలక నేతలు మోకాలడ్డడం చర్చనీయాంశంగా మారింది. 'గుండేటి' టీఆర్ఎస్ టికెట్‌కు అర్హుడు కాదా ? లేక వారనుకున్న స్కెచ్ వర్కవుట్ కాదని ముందే 'గుండేటి'ని తప్పించాలని భావించారా ? అంటే రెండోదే కరెక్ట్ అని ఆయన అనుచరవర్గం అంటోంది. మేయర్ పదవి విషయంలో జరుగుతున్న ప్రచారంపై 'గుండేటి' అధిష్టానం నుంచి స్పష్టత తీసుకున్నాకే పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాక్షేత్రంలో నిత్యం సంబంధాలుండే వ్యక్తి రేపు గెలిస్తే పోటీ అవుతాడేమోనని భావించడం వల్లే పలువురు నేతలు పార్టీ బీ ఫారం ఇవ్వడానికి అడ్డుగా నిలిచారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకానొక దశలో 'గుండేటి'కి పోటీగా మరో అభ్యర్థికి టికెట్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. చివరి నిమిషంలో జరిగిన పరిణామాలతో 'గుండేటి' రీ ఎంట్రీ ఖరారైంది. ఈ పరిణామాలు గ్రేటర్ వరంగల్‌లో చర్చనీయాంశంగా మారింది. ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఉద్యమకారులను విస్మరిస్తోందనే ప్రచారానికి ఈ పరిణామాలు బలం చేకూర్చినట్టయ్యింది.
కీలక నేతల మధ్య ఆధిపత్యపోరు
మేయర్ అభ్యర్థి విషయంలో అధికార టీఆర్ఎస్ నేతల మధ్య కీచులాట ప్రారంభమైంది. గత పాలకవర్గంలో వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన నన్నపనేని నరేందర్, గుండా ప్రకాశ్రావులు మేయర్‌గా పని చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే నరేందర్‌కు అత్యంత సన్నిహితులుగా గుండేటి నరేంద్రకుమార్, దిడ్డి కుమారస్వామి బరిలోకి దిగారు. ఏ పదవి వచ్చినా వీరిద్దరికే మొదటి ప్రాధాన్యత ఉంటుందనడంలో సందేహం లేదు. బీసీ సామాజికవర్గంలో పద్మశాలీ కులానికి చెందిన 'గుండేటి'కి సామాజిక సమీకరణలు కలిసొచ్చే అవకాశముంది. మేయర్ పదవి విషయంలో మంత్రులు, ఇతర నేతల అభిప్రాయాలు ఒక రకంగా ఉంటే, నగర ఎమ్మెల్యేల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ వరంగల్ నగరంలో 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి ఉంది. ఈ ఐదుగురు ఎమ్మెల్యేల అభిప్రాయాలకు భిన్నంగా మంత్రులు వ్యవహరించడం పట్ల నగర ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. గ్రేటర్ వరంగల్ మేయర్ పదవి విషయంలో తమ మాటే చెల్లుబాటు కావాలనే భావనలో నగర ఎమ్మెల్యేలుండగా తమ అభిప్రాయమే చెల్లుబాటు కావాలనే అభిప్రాయంలో మంత్రులు, ఇతర నేతలున్నట్లు తెలుస్తోంది. దీంతో మేయర్ పదవిపై పీఠముడి బిగుసుకుంది.