Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తరచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు
- ఇబ్బందులు పడుతున్న వాహన దారులు
- పట్టించుకోని ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-నడికూడ
వరంగల్ రూరల్ జిల్లా నడికుడ మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లు గుంతల మయంగా మారాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని బిక్కు బిక్కుమంటూ రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. మండలంలోని కౌకొండ గ్రామం నుంచి పరకాలకు వెళ్ళు ప్రధాన రహదారి గుంతలతో ప్రమాదకరంగా మారింది. కొద్ది రోజుల క్రితం ద్విచక్ర వాహనదారులు ఆ గుంతలో పడి తీవ్ర గాయాల పాలయ్యారు. అలాగే నర్సక్క పల్లి క్రాస్ నుంచి అంబాల పరకాల రోడ్డుకి వెళ్లే ప్రధాన రహదారి పెద్ద పెద్ద గుంతలతో ప్రమాదకరంగా ఉంది. దానికి తోడు అధిక మూలమలుపులు కూడా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం సూచిక బోర్డులు కూడా లేకపోవడంతో ఎదురుగా వచ్చే వాహ నాలు కనబడడటం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు పెరగడంతో ఈ దారి గుండా ప్రయాణికులు వెళ్లాలంటేనే జంకుతున్న పరిస్థితి నెలకొంది. ఎలాంటి ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్లకు మరమ్మతులు చేసి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి
పరకాలలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ మిత్ర గా పని చేస్తాను. ప్రతిరోజు ఉదయాన్నే వెళ్లి రాత్రి సమయంలో ఇంటికి వస్తుం టాను. అలాగే చాలామంది జీవన ఉపాధి కోసం వివిధ షాపులలో పని చేస్తూ సాయంత్రం రాత్రి 8 నుంచి 9 గంటల సమయంలో ద్విచక్ర వాహనం పై ప్రయాణం చేస్తుంటారు. రాత్రిపూట ఈ రోడ్డుపై వెళ్లాలంటే నే భయమేస్తోంది. రోడ్డు బాగా గుంతలు పడడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు పునరావతం కాకుండా చర్యలు చేపట్టి రోడ్డుకు మరమ్మతులు చేయాలి.
- గురిజాల తిరుపతి వాహనదారుడు
పై అధికారులకు నివేదిక పంపించాం
ఈ రోడ్లపై పై అధికారులకు నివేదికలు పంపించాం. కొన్ని రోడ్లకు మాత్రమే మరమ్మతులకు అనుమతులు వచ్చాయి. పై నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే మరమ్మతులు చేయిస్తాం.
- గోపి, ఆర్అండ్బీ ఏఈ