Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
సీఎం కేసీఆర్ మానస పుత్రిక అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కొంతమంది తూట్లు పొడుస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజి కరకట్ట మట్టిని యధేచ్ఛగా తోడేస్తున్నారు. బెగ్లూర్ గ్రామ శివారులోని ఇసుక క్వారీల కాంట్రాక్టర్లే ఇందుకు నిదర్శనమని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరించడంతో కాంట్రాక్టర్లు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా మారుతోంది. దీంతో వర్షాకాలం బ్యారేజీలో నీటి సామర్థ్యం పెరిగి కరకట్ట కోతకు గురయ్యే ప్రమాదం ఉందని, పంట పొలాలు, చేను చెలక దెబ్బతింటాయని పలువురు పేర్కొంటున్నారు. గోదావరిలో కొలతలు లేకుండా ఇష్టానుసారంగా ఇసుకను అందినకాడికి పర్యావరణానికి ముప్పు వాటిల్లే విధంగా కాంట్రాక్టర్లు తోడేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, లేదంటే రైతులు, పర్యావరణ ప్రేమికులు అందరూ ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని పర్యావరణ పరిరక్షణ సమితి జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాయకుడు సూరం మహేష్ హెచ్చరించారు.