Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్,
నవతెలంగాణ-భూపాలపల్లి/జనగామ
కరోనా బాధితులకు సకాలంలో వైద్యం అందించడంలో పూర్తి సహకారమందిస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన అభివృద్ధి, మహిళా-శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా అధికార యంత్రాంగానికి భరోసానిచ్చారు. గురువారం ఇద్దరు మంత్రులు వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా లోని మిగతా జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా కట్టడికి తీసు కుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ పై సమీక్షించారు. సీఎం కేసీఆర్, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సహకారంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ కూడా కరోనా టెస్టింగ్ కిట్లు, వ్యాక్సిన్, రెమిడిసివర్ మెడిసిన్, ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నారని అన్నారు. ఎంజీఎం ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మారుస్తున్నందున ప్రజలు ఎంజీఎంకు రావాలన్నారు. సాధారణ వైద్య సేవల కోసం కేఎంసీని సిద్ధం చేస్తున్నామని,ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు ప్రైవేటు ఆసుపత్రులలో కూడా ఆక్సిజన్ కొరత రాకుండా జిల్లా కలెక్టర్ పర్యవేక్షించాలని అన్నారు. గ్రామస్థాయిలో వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్ అధికారులు స్థానిక సర్పంచ్, వార్డు సభ్యుల సహకారంతో కరోనా సోకిన వ్యక్తులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే ఉండేలా చర్యలు చేపట్టాలని, కంటైన్మెంట్ ప్రాంతాల్లో అవసరమైన వైద్య సేవలు అందించాలని, శానిటేషన్ కార్యక్రమాలు పక్కాగా నిర్వహించాలన్నారు. ఉపాధి హామీ కూలీలు గుంపులుగా పని చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అత్యధిక మంది కూలీలకు ఉపాధి కల్పించాలని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాల, మహాదేవపూర్ సీిహెచ్సీల్లో 60 బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో అందుబాటులో ఉంచామని అన్నారు. భూపాలపల్లి, కాటారం, చిట్యాల, మహాముత్తారం, తాడిచర్లలో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రిలో, ఏటూరునాగారం సీహెచ్‌సీలో ఆక్సిజన్ తో కూడిన బెడ్లు ఏర్పాటు చేసి కరోనా వైద్య సేవలందిస్తున్నామన్నారు. రెండు జిల్లాల వైద్యఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది, జిల్లా,మండల, గ్రామస్థాయి అధికారులు, మండల ప్రత్యేక అధికారుల ద్వారా కరోనా బాధితులకు వైద్య సేవలందించడంతోపాటు వ్యాక్సినేషన్ కార్యక్రమం సాఫీగా జరిగేలా చూస్తున్నామని తెలిపారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి కలెక్టర్ మాట్లాడారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని, 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలని అన్నారు. సింగరేణి, జెన్కో కంపెనీల ఆసుపత్రుల్లో కరోనా వైద్య సేవలు, ఆయా ఆసుపత్రుల్లో ప్రజలకు వైద్యం అందిం చడానికి అవసరమయ్యే సౌకర్యాలను ఆయా సంస్థల అధికారులతో సమీక్షించాలన్నారు. గ్రామాల్లో, మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలలో నిత్యం కరోనా బాధితులను పరిశీలించాలన్నారు. మరియు శానిటేషన్ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని, కొత్తగా రెండు ఆక్సిజన్ తో కూడిన అంబులెన్స్ లను సిద్ధం చేయాలని సూచించారు. వరంగల్ ఎంజీఎం, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే జిల్లాలోని ప్రజల వివరాలు సేకరించి వారికి ఆయా ఆస్పత్రుల్లో సకాలంలో వైద్య సేవలు అందేలా ఒక ప్రత్యేక అధికారి నియమించి పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్, డీఎంహెచ్ఓ సుధార్‌సింగ్, డీపీఓ ఆశాలత, డీఆర్డిఓ పురుషోత్తం, జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి మమత, డాక్టర్ రవి, డీఎల్పీవో సుధీర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని చర్యలు తీసుకుంటున్నాం : కలెక్టర్ నిఖిల
జనగామ జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు చర్యలు తీసుకు న్నామని కలెక్టర్ నిఖిల తెలిపారు. కావాల్సిన ఆక్సిజన్ అందుబాటులో ఉంచి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్లు ఏ భాస్కర్‌రావు, అబ్దుల్ హమీద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఏ. మహేందర్, డిఆర్డిఓ జి. రాంరెడ్డి, డీపీఓ రంగాచారి, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ రఘు, మున్సపల్ కమీషనర్ నర్సింహ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.