Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆప్ ఇండియాలో పని చేస్తున్న నలుగురికి కరోనా పాజిటివ్ నమోదు కావడంతో గురువారం ఉదయం నుంచి బ్యాంకు సేవలు నిలిపేశారు. మండలంలో కరోనా కేసుల తీవ్రత ఎక్కవవుతుండడంతో ఇప్పటికే మండల కేంద్రంలోని గంపోనిగూడెం, అకినేపల్లి మల్లారం, రామచంద్రునిపేట గ్రామాలను జిల్లా కలెక్టర్ కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచికి పని వేళల్లో వందలాదిగా ఖాతాదారులు వస్తుండడంతోనే సిబ్బందికి కరోనా సోకినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గురువారం బ్యాంకు విధులకు హాజరైన సిబ్బందిలో ఒకరికి కరోనా లక్షణాలుండడంతోపాటు జ్వరం రావడంతో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఆందోళన చెందిన మిగతా సిబ్బంది బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వారి ఆదేశాల మేరకు సిబ్బంది కరోనా టెస్టులు చేయించుకోగా మరో నలుగురికి పాజిటవ్ నిర్ధారణ అయ్యింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బ్రాంచిని మూసేసిన అధికారులు గ్రామపంచాయతీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో బ్లీచింగ్తోపాటు సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేశారు. పాజిటివ్ నిర్ధారణ అయిన ఉద్యోగులు హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారు. ఖాతాదారులు అత్యవసరమైతే సమీపంలోని యూనియన్ బ్యాంక్ ఆప్ ఇండియాకు వెళ్లి లావాదేవీలు జరుపుకోవాలని నోటీసు బోర్డులో వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బ్రాంచి పని వేళలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.