Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 66 వార్డులు 6.53 లక్షల మంది ఓటర్లు
- 878 పోలింగ్ కేంద్రాలు
- 3,736 మందితో పోలీసు బందోబస్తు
- పోలింగ్ సిబ్బందికి సామాగ్రి అందజేత
నవతెలంగాణ-వరంగల్
గ్రేటర్ వరంగల్ నగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. కరోనా భయం వెంటాడుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు నగరవాసులు ఏ మేరకు ఆసక్తి చూపుతారన్నది చర్చనీయాంశంగా మారింది. వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రతిరోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఎన్నికలకు నగరవాసులు ముఖం చాటేస్తారేమోనన్న ఆందోళన అధికార యంత్రాంగంలో కనిపిస్తోంది. ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు కరోనా కల్లోలం నేపథ్యంలో శుక్రవారం పోలింగ్ ఆసక్తికరంగా మారింది.
గ్రేటర్ వరంగల్ నగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు శుక్రవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్నాయి. ఓటర్లు మాస్క్ ధరించి రావాలని జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు కోరారు. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కాజీపేట నిట్ కాలేజీ పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామాగ్రిని తీసుకొని సంబంధిత పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా తరలివెళ్లారు. గ్రేటర్ వరంగల్ నగరంలో మొత్తం 6 లక్షల 53 వేల 240 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 3 లక్షల 23 వేల 100 మంది కాగా మహిళలు 3 లక్షల 29 వేల 964 మంది ఉన్నారు. మొత్తం 878 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 3,075 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులను నిర్వహిస్తున్నారు. ఇందులో వెయ్యి 25 మంది చొప్పున పోలింగ్, సహాయ పోలింగ్ అధికారులున్నారు. పోలింగ్ సిబ్బందికి ఎన్-95 మాస్క్‌లు, సానిటైజర్లు, చేతి తొడుగులు, ఫేస్ షీల్డ్‌లను అందచేశారు. 46 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహిస్తున్నారు. 529 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 231 పోలింగ్ స్టేషన్లకు మైక్రో అబ్జర్వర్లను నియమించారు.
3,736 మందితో పోలీసు బందోబస్తు
గ్రేటర్ వరంగల్ నగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 66 డివిజన్లలో 3,736 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రేటర్లో పోలింగ్ స్టేషన్లను నాలుగు కేటగిరీలుగా విభజించారు. మొత్తం 878 పోలింగ్ స్టేషన్లలో 357 పోలింగ్ స్టేషన్లు సాధారణమైనవి కాగా, 195 సున్నితమైనవి, 159 అతిసున్నితమైనవి. అలాగే 167 క్లిష్టమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. 44 రూట్ మొబైల్ పార్టీలు, 31 స్ట్రైకింగ్ ఫోర్స్, 4 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో అడిషనల్ డీసీపీతోపాటు 12 మంది ఏసీపీలు, 66 మంది సీఐలు, ఆర్ఐలు, 241 మంది ఎస్సైలు, ఆర్ఎస్సైలు, 1419 కానిస్టేబుళ్లు, 726 మంది హోమ్ గార్డులు, 8 మంది ఏఆర్ ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 565 మంది ఆర్డ్మ్ ఫోర్స్, 43 మంది డిస్ట్రిక్ట్ గార్డ్స్ ఎన్నికల విధులు నిర్వహిస్తారు. ఎన్నికల బందోబస్తులో ఉన్న పోలీసు సిబ్బందికి ఎన్-95 మాస్క్‌లు, శానిటైజర్లు అందచేశారు.