Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రసాభాసగా మారిన ఉపసర్పంచ్ అవిశ్వాస తీర్మానం
నవతెలంగాణ-జనగామ
మండలంలోని ఎర్రగొల్లపహాడ్ గ్రామంలో కాంగ్రెస్ ఉపసర్పంచ్‌పై మోపిన అవిశ్వాస తీర్మానం ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణతో పాటు పోలీసులతో తోపులాట జరిగింది. పరిస్థితి విషమించడంతో పోలీసులు లాఠీ ఝుళిపించారు. సర్పంచ్ వంగాల రేణుక శంకర్ మరికొంత మంది వార్డు సభ్యులు కలిసి ఉపసర్పంచ్ గూడలి కల్పన శేఖర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అందులో భాగంగా అధికార పార్టీకి చెందిన సర్పంచ్ బంగాల రేణుక శంకర్ మరికొంత మంది సభ్యులతో క్యాంప్ రాజకీయాలు నిర్వహించారు. కాగా నిబంధనల మేరకు అధికారులు బుధవారం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహిస్తున్నారని ఉపసర్పంచ్ గూడెల్లి కల్పన శేఖర్‌తోపాటు కాంగ్రెస్ నాయకులు శ్రేణులు గ్రామపంచాయతీ సమీపంలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. మరోవైపు టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య తోపులాటతో ఘర్షణ చోటుచేసుకుంది. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని నివారించేందుకు ప్రయత్నించారు. ఆర్డీఓ మధుసూదన్ అధ్యక్షత వహిస్తుండగా సమావేశం మందిరంలోకి చొచ్చుకు పోయేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంల తోపులాట తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ దశలో పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. నిబంధనల మేరకు తప్పకుండా సమావేశం నిర్వహించి తీరతామని ఆర్డీఓ స్పష్టం చేసి సమావేశం నిర్వహించారు. అవిశ్వాస తీర్మానానికి మెజార్టీ సభ్యులు ఓటు వేయడంతో ఉపసర్పంచ్‌ను తొలగిస్తున్నట్లు చేసిన తీర్మానాన్ని జిల్లా కలెక్టర్‌కు పంపించినట్లు ఆర్డీఓ ప్రకటించారు.