Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమర్ధవంతంగా పోలీసు,
- ఇతర శాఖల విధులు
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-మహబూబాబాద్
కరోనా నిర్మూలనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ లాక్డౌన్ ప్రకటించారని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. కరోనాను కట్టడి చేసేందుకు పోలీసు, ఇతర శాఖల అధికారులు సిబ్బంది సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారని ఆమె చెప్పారు. జిల్లా కేంద్రంలో లాక్డౌన్ అమలును ఎస్పీ కోటిరెడ్డితో కలిసి మంత్రి సత్యవతి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కోవిడ్ నివారణ కోసం పోలీసులు, ఇతర శాఖల ఉద్యోగులు ఏడాదిగా శ్రమిస్తున్నారని చెప్పారు. ప్రజలు కోవిడ్-19 నిబంధనలు పాటించాలని సూచించారు. లాక్డౌన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రతిరోజు 4 గంటలు సడలిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 6 నుంచి 10 వరకు ప్రజలు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పనులు పూర్తి చేసుకోవాలని కోరారు. గ్రామాల్లో కోవిడ్ కట్టడి, గుర్తింపు, చికిత్స కోసం వేసిన కమిటీల్లో కూడా పోలీసులు ఉంటూ చొరవ తీసుకుంటున్నారని చెప్పారు. జిల్లాలో దాదాపు 4 వేల మందికి కోవిడ్ లక్షణాలున్నట్టు గుర్తించి వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో కోవిడ్ చికిత్సకు అవసరమయ్యే మందులు, వసతులు ఉన్నాయని చెప్పారు. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపారు.
ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యం : ఎస్పీ
ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించిందని ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి తెలిపారు. లాక్డౌన్ను పరిశీలించిన సందర్భంగా ఆయన వాహనదార్లతో మాట్లాడారు. స్వీయనిర్భంధం క్షేమకరమన్నారు. తప్పనిసరై బయటకు రావాల్సి వచ్చినా నిబంధనలు పాటించాలని చెప్పారు. ఎస్పీ వెంట టౌన్ సీఐ వెంకటరత్నం ఉన్నారు.