Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
- సారంపల్లి వాసుదేవరెడ్డి
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వర్ధంతి
నవతెలంగాణ-వరంగల్
పుచ్చలపల్లి సుందరయ్య దేశానికే ఆదర్శంగా నిలిచారని సీపీఐ(ఎం) వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి కొనియాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తం గా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బుధవారం సుందరయ్య 36వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో సుందరయ్య చిత్రపటానికి జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి జిల్లా కమిటీ సభ్యుడు గొడుగు వెంకట్ అధ్యక్షత వహించగా వాసుదేవరెడ్డి మాట్లాడారు. సుందరయ్య అందించిన సేవలను కొనియాడారు. నిజాం కాలంలో సుందరయ్య నిర్మించిన పోరాటాలను గుర్తు చేశారు. దివిసీమ ఉప్పెనలో వేలాది మంది చనిపోతే సుందరయ్య ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్‌లు నిర్వహించారని చెప్పారు. సుందరయ్య పోరాట స్ఫూర్తి సమాజాన్ని ముందుకు నడుపుతుందని తెలిపారు. దోపిడీని అంతం చేసి, సమ సమాజాన్ని స్థాపిస్తుందని నమ్మి జీవితాన్ని కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితం చేశారని కీర్తించారు. పీడన, అసమానత, అన్యాయాలను ఎదిరించారని తెలిపారు. పీడిత ప్రజలను చైతన్యవంతం చేసేందుకు క్రియాశీలకంగా వ్యవహరించారని స్మరించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఉద్యమాలు నిర్మించి అండగా నిలిచారని చెప్పారు. ప్రజాపోరాటాలను, సంఘ సంస్కరణలను, సేవా కార్యక్రమాలను మేళవించి సామాజిక మార్పు ఉద్యమానికి మార్గనిర్దేశం చేశారని తెలిపారు. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాపితంగా హెల్ప్‌లైన్, ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. వరంగల్ ఉర్సుగుట్ట సమీపంలోని పార్టీకార్యాలయంలో త్వరలోనే 20 బెడ్లతో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి ప్రభాకర్‌రెడ్డి, రాగుల రమేష్, జిల్లా కమిటీ సభ్యుడు సింగారపు బాబు, నాయ కులు బాషబోయిన సంతోష్, తదితరులు పాల్గొన్నారు.