Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-అందుబాటులో వైద్య సదుపాయాలు : ఎమ్మెల్యే పెద్ది
- కోవిడ్ కట్టడికి భాగస్వామ్యులవ్వండి : కలెక్టర్
- లాక్డౌన్ అమలుకు కట్టుదిట్టమైన చర్యలు : సీపీ
- 4,380 మంది కోవిడ్ బాధితులకు టెలీకాన్ఫరెన్స్‌లో భరోసా
నవతెలంగాణ-నర్సంపేట
'కోవిడ్ బాధితులు అధైర్య పడకండి. అందుబాటులో మెరుగైన వైద్యమందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌లో నిబ్బరంగా ఉండండి. ఆక్సిజన్ బెడ్స్, రెమిడిసివర్ ఇంజక్షన్లు వంటి అన్ని రకాల వైద్య సేవలు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ధైర్యంతో కరోనాపై విజయం సాధించండి.' అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం హరిత, వరంగల్ సీపీ తరుణ్ జోషి కరోనా బాధితులకు భరోసానిచ్చారు. గురువారం ఎమ్మెల్యే నేతృత్వంలో నియోజకవర్గంలోని 4,380మంది కరోనా బాధితులు వారి కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగంతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా తనకు గాని, తమ సిబ్బందికి గాని ఫోన్ చేసి వైద్య సహాయం పొందొచ్చన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నేటి నుంచి లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినంగా మారనున్నాయని తెలిపారు. అందరం ఆత్మస్థైర్యంతో కరోనాతో పోరాడాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఎం హరిత మాట్లాడుతూ.. కరోనాను ఎదుర్కోవడానికి సాధరణ ప్రజల నుంచి ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా నిర్థారణ పరీక్షలు ప్రతి సబ్ సెంటర్లో చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్న వారు మాత్రమే నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలన్నారు. కరోనా బారిన పడిన వారు ఇండ్లలో తగిన సౌకర్యాలు లేకుంటే ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లో చేరాలన్నారు. 20 మందికి మించి కరోనా బాధితులు ఉంటే ఆ గ్రామంలోని పాఠశాల గానీ, ఆదర్శ పాఠశాల, కస్తూరిభా గురుకులాల్లో సదుపాయాలు ఉన్న వద్ద ఐసోలేషన్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతినిస్తామన్నారు. వీటిని తహసిల్దార్లు పర్యవేక్షిస్తారని, పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది ఎప్పటిక్పుడు మందులు అందజేస్తూ జాగ్రత్తలు సూచిస్తారని అన్నారు. ఎవరి ఇండ్లల్లో వారే ఉంటూ కరోనా నియంత్రణకు సహకరించాలన్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజ్ కొరత ఉందనే అపోహలు వీడాలని శ్వాస సంబంధించి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేరితే తక్షణమే వైద్య సదుపాయం కల్పిస్తామని తెలిపారు. గ్రామాల్లోని ప్రజలకు వ్యాధి తీవ్రత పట్ల అవగాహన పెంచి వారిలో మానసిక ధైర్యాన్ని నింపడం బాధ్యతగా గుర్తించాలని ప్రజా ప్రతినిధులకు సూచించారు. ఇప్పటికే అన్ని శాఖల వారికి కోవిడ్ నివారణకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అనంతరం సీపీ తరున్ జోషి మాట్లాడుతూ.. లాక్డౌన్ ఈ నెల చివరి నాటి వరకు పగడ్భందిగా అమలు చేయడానికి పోలిస్ అధికారులను అప్రమత్తం చేసి పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. కరోనా నియంత్రణకు లాక్డౌన్ ఉపయోగపడనుందని అన్నారు. మార్కెట్లు, వ్యాపార సముదాయాలు, ఇతర జన సమూహ ప్రదేశాల వద్ద గుమికూడొద్దన్నారు. లాక్డౌన్ నిబంధనలు కఠినతరంగా అమలు చేస్తున్నామని ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, శానిటైజర్లు ఉపయోగించాల న్నారు. పెండ్లిలో 40 మందికి మించి హాజరు కావొద్దన్నారు. ప్రజలు పోలీసులకు సంపూర్ణ సహకారం అందిచాలన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్‌లో రూరల్ జిల్లా డీఎంహెచ్ఓ మధుసూదన్, నర్సంపేట ఆర్డీఓ పి పవన్‌కుమార్, నియోజకవర్గ ఆరు మండల ఎంపీపలుీ, జెడ్పీటీసీలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు, సీఐలు, ఎస్సైలు, పీఏసీఎస్ చైర్మెన్లు, పంచాయతి కార్యదర్శులు పాల్గొన్నారు.