Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్ధార్ కార్యాలయానికి ధాన్యం లారీ...
- దిగుమతిలో రైస్ మిల్లర్ యజమాని కొర్రీలు
- ఐదు రోజులుగా ఇక్కట్లు
- భోజనం, నీరు దొరకడం లేదని డ్రైవర్ ఆవేదన
నవతెలంగాణ-శాయంపేట
కొనుగోలు కేంద్రాల నుండి లారీల్లో తీసుకొచ్చిన ధాన్యాన్ని దిగుమతి చేసుకునేందుకు తేమ పేరుతో రైస్ మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. తేమ ఎక్కువగా ఉందని 44 కిలోల తూకం అయితేనే ధాన్యం దిగుమతి చేసుకుంటామని చెబుతుండడంతో రైతులు ఒప్పుకోకపోవడంతో లారీ డ్రైవర్ ఐదు రోజులుగా ఇబ్బందులు పడ్డాడు. గత్యంతరంలేక తహసీల్దార్ కార్యాలయం ముందు ధాన్యం లారీని తీసుకొనివచ్చి అధికారుల ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు. లారీ డ్రైవర్ వీరయ్య కథనం ప్రకారం... మండలంలోని మైలారం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన కొనుగోలు కేంద్రం నుంచి ఈ నెల 16న ఉదయం గ్రామంలోని నలుగురు రైతులు మోహన్ రెడ్డి, కొమరా రెడ్డి, మైపాల్ రెడ్డి, సాంబరెడ్డి లకు చెందిన 530 బస్తాలను లోడ్ చేసుకొని తాహారాపూర్ గ్రామంలోని శ్రీనివాస రైస్ మిల్ వద్దకు వెళ్ళాడు. అక్కడ రెండు రోజుల అనంతరం వేబ్రిడ్జి వేసి పరకాల మార్కెట్ గోడౌన్లో దిగుమతి చేయాలని మిల్లర్లు చెప్పడంతో లారీని తీసుకుని పరకాల మార్కెట్ గోడౌన్‌కు వెళ్లారు. ధాన్యం బస్తాలు లో తేమ ఎక్కువగా ఉందని ఇక్కడ దిగుమతి చేయడం కుదరదని రైస్ మిల్లులోని బట్టికే తీసుకెళ్లాలని చెప్పడంతో వీరయ్య లారీని బట్టి వద్దకు తీసుకువచ్చాడు. ఇదే అదనుగా రైస్ మిల్లర్లు బస్తాకు 44 కిలోల చొప్పున ఇస్తేనే తీసుకుంటామని తెలపడంతో స్థానిక రైతులు 42 కిలోలకు అంగీకరించారు. దీంతో రైస్ మిల్లు యజమాని ధాన్యాన్ని తిరస్కరించడంతో లారీ డ్రైవర్ వీరయ్య గురువారం మధ్యాహ్నం ధాన్యం లారీని తహసీిల్దార్ కార్యాలయం ముందుకు తీసుకొచ్చి అధికారుల ముందు తన గోడు వెళ్లబోసుకున్నారు. అయిదు రోజుల నుండి హౌటల్స్ లేకపోవడంతో తిండికి ఇబ్బంది అయిందని, కరోనా వైరస్ భయంతో మంచినీరు కూడా ఎవరూ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన డిప్యూటీ తహసీల్దార్ బద్రునాయక్, ఆర్ఐ హేమనాయక్ రైస్ మిల్లర్ల తో మాట్లాడి ధాన్యం దిగుమతి చేసుకోవాలని ఆదేశించి ధాన్యం లారీనీ రైస్ మిల్కు పంపించారు.