Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
ప్రయివేటు ఆస్పత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కరోనా బారిన పడిన పేదలకు ఉచిత వైద్యమందించాలని, ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేస్తూ కరోనాతో మృతిచెందిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఎంసీపీఐ(యూ) వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి పనాన ప్రసాద్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా గురువారం పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, మ ప్రతి కుటుంబానికి నెలకు రూ.7500లతోపాటు ఉచితంగా నిత్యావసర వస్తువులు అందజేయాలన్నారు. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు తదితర సిబ్బంది స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయాలని కోరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కరోనా కట్టడికి నిరంతర పర్యవేక్షణ, వైద్యం అందుబాటులో ఉండేలా మొబైల్ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. నేడు లక్షలాది మంది ప్రజలు కరోనా బారిన పడి ఆక్సిజన్, వైద్యం అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ముందస్తుగా ఉద్యోగులు, కూలీలు, వలస కార్మికులు, సాధారణ ప్రజానీకానికి ఎలాంటి భరోసా ఇవ్వకుండా లాక్ డౌన్ ప్రకటించి చేతులు దులుపుకుందన్నారు. ముంబై, గోవా, తమిళనాడు లాగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రైవేటు హాస్పిటల్స్ అన్నింటిని స్వాధీనం చేసుకొని ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యమందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైద్యాన్ని కార్పొరేట్ హాస్పిటల్స్‌కు అప్పచెప్పి ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వీర్యం చేసే దిశగా వ్యవహరిస్తున్నాయన్నారు. తమిళనాడు తరహా అన్ని రాజకీయ పక్షాలతో కలిపి కరోనా నివారణ మార్గానికి అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గడ్డం నాగార్జున, జిల్లా నాయకులు గోరంటల శరత్‌బాబు, శ్రీధర్, సారయ్య, తదితరులు పాల్గొన్నారు.