Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఎర్రబెల్లి' ట్రస్ట్ ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ
నవతెలంగాణ-తొర్రూరు
కరోనా బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. తొర్రూరు, పెద్దవంగర మండలాల్లో కోవిడ్ వైరస్ సోకిన 3 వేల మందికి ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, 3 లక్షల మాస్క్‌లు, స్త్రీ నిధి ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి 10 ఆక్సీజన్ కాన్సెంట్రేటర్లను జిల్లా కలెక్టర్ గౌతమ్‌తో కలిసి మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి దయాకర్‌రావు మాట్లాడారు. కరోనా మహమ్మారితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో ప్రజల పక్షాన నిలబడాలని చెప్పారు. ఆపద కాలంలో ప్రజలను ఆదుకుంటేనే గుర్తు పెట్టుకుంటారని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల సేవలను దష్టిలో ఉంచుకొనే 50 పడకలకు పెంచే అవకాశం లభించిందని చెప్పారు. తొర్రూరు ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐ దంపతులు అనుమాండ్ల రాజేందర్‌రెడ్డి-ఝాన్సీ దాతృత్వంతో 5 ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్లను పాలకుర్తిలో, మరో ఐదింటిని ఎంజీఎంకి అందించామని తెలిపారు. మరో 10 కాన్సెన్ట్రేటర్లు రానున్నట్టు వివరించారు. కరోనా బాధితులను ప్రేమతో పలకరించాలని, వారికి అవసరమైన వాటిని సమకూర్చాలని మంత్రి ఆదేశించారు. 300 పడకలతో జిల్లాకు వైద్య కళశాల మంజూరైందని చెప్పారు. వైద్యానికి కొరత ఉండదన్నారు. నిరుపేదలకు వైద్య సౌకర్యం మెరుగవుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రవీందర్, ఆర్డీఓ రమేష్, డీఎస్పీ వెంకటరమణ, మున్సిపల్ చైర్మెన్ రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు, తహసీల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీఓ భారతి, తదితరులు పాల్గొన్నారు.