Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
నవతెలంగాణ-జనగామ
కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న ధాన్యం లిఫ్టింగ్ సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపురం, జాఫర్గూడెం, అశ్వరావుపల్లి, వెల్ది గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంరదాలను సీపీఐ(ఎం) బృందం గురువారం సందర్శించింది. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే ప్రభుత్వ, అధికారుల నిర్లక్ష్యం వల్ల 40 రోజులుగా రాత్రింబవళ్లు రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోందని చెప్పారు. కాంట్రాక్టర్ సరైన సమయంలో లారీలను పంపక పోవడంతో కాంటా వేసిన ధాన్యం కుప్పలుగా నిల్వ ఉంటోదని తెలిపారు. వర్షాల వల్ల బస్తాల్లో నింపిన ధాన్యం తడిచిందని చెప్పారు. ఇప్పటికైనా కాంట్రాక్టర్ స్పందించి రోజువారీగా కొనుగోలు సెంటర్లకు లారీలను పంపించి ధాన్యాన్ని లిఫ్టింగ్ చేయాలన్నారు. అలాగే రైస్ మిల్లర్లు మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని సకాలంలో దింపుకోకుండా అనేక సాకులతో రైతుల ధాన్యాన్ని అప్పనంగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో, మిల్లుల్లో ధాన్యంలో కోత విధించడం దుర్మార్గమన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల్లో, మిల్లుల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలపై విచారణ చేపట్టిన బాధ్యులపై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రఘునాథపల్లి మండల కార్యదర్శి పొదల నాగరాజు, నాయకులు శాగ యాదగిరి, గాజుల గట్టయ్య, శాగ సాంబరాజు, మల్లేష్, నాగయ్య, రాజు, కనకయ్య, ఎల్లయ్య, వెంకటయ్య, నర్సయ్య, పొదల దేవేందర్, లవకుమార్, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి : మండలంలోని బమ్మెర గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీపీఐ(ఎం) బృందం సందర్శించింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకుడు సోమ సత్యం మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు. ధాన్యాన్ని తరలించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గ్రామంలో 2850 బస్తాలు కాంట పెట్టినా మిల్లులకు పంపడంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి చిట్యాల సోమన్న, ఒగ్గుల కుమార్, కుంట శ్రీను, లకావత్ సోమ్లా, భూక్య లాల్, లకావత్ సుందర్, లకావత్ చంద్రు, బానోతు రవి, మానుపాటి చంద్రయ్య, బొంకూరు సోమయ్య, దండబోయిన కొమురయ్య, పెంతల మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.