Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిట్టనిలువునా చీలుతున్న టీఆర్ఎస్ మారుతున్న రాజకీయం
నవతెలంగాణ-వరంగల్
మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ను ఒంటరి చేయడానికి టీఆర్ఎస్ అధిష్టానం మండలానికి ఒక ఇన్‌ఛార్జిని నియమించి 'ఈటెల' కేడర్‌ను తమవైపు తిప్పుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. మంత్రి గంగుల కమలాకర్ వద్దకు వెళ్లి టీఆర్ఎస్లోనే కొనసాగుతామని ప్రకటించిన నేతలు కూడా 'ఈటెల' రాగానే ఆయన వెంట ఉండడం గమనార్హం. 'ఈటెల' సొంత మండలానికి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టి 'ఈటెల' కేడర్‌ను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ మండలంలో పింగిళి ప్రదీప్‌రెడ్డి కేడర్‌ను టీఆర్ఎస్లో కొనసాగేలా చేయడానికి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్తోనే 'ఈటెల' కేడర్ ఉండేలా చేయడానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తెరపై మంత్రి గంగుల కమలాకర్‌ను పెట్టినా ఆయనపై వున్న ఆరోపణలు, వ్యాఖ్యలు పార్టీకి నష్టదాయకంగా పరిణమించినట్లు సమాచారం. దీంతో టీఆర్ఎస్ అధిష్టానం తెరవెనుక కీలక నేతలను రంగంలోకి దించి తమకనుకూలంగా పావులు కదుపుతోంది.
మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ను రాజకీయంగా ఒంటరి చేయడానికి టీఆర్ఎస్ అధిష్టానం సామ, బేధ, దండోపాయాలను ప్రయోగిస్తోంది. ముఖ్యంగా హుజురాబాద్ నియోజకవర్గంలోని 'ఈటెల' సొంత మండలం కమలాపూర్‌లోనే ఆయన్ను దెబ్బతీయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. 'ఈటెల'ను దెబ్బతీయడానికి కాంగ్రెస్ నేతలను సైతం టీఆర్ఎస్ ప్రయోగించడం గమనార్హం. 'ఈటెల'పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పాడి కౌశిక్‌రెడ్డిని రంగంలోకి దించి ఆయనపై ఆరోపణలు చేయించడమే కాకుండా టీఆర్ఎస్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం చేయడం వెనుక అసలు రహస్యమిదేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 'ఈటెల' కాంగ్రెస్ పెద్దలను కలవడం, వారంతా, ఆయన బర్తరఫ్‌పై చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా పాడి కౌశిక్‌రెడ్డి 'ఈటెల'పై విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించింది. మొదటి నుంచి కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ కోవర్టులున్నారన్న ప్రచారం ఉంది. ఈ విషయం కాంగ్రెస్ కేడరే బహిరంగంగా చెబుతుండడం గమనార్హం. ఇదిలా ఉంటే అందుకు నిదర్శనంగా పాడి కౌశిక్‌రెడ్డి విమర్శలు చేయడం పార్టీని ఇరుకున పెట్టింది. దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కేడర్‌లో అయోమయం నెలకొంది. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కలగచేసుకొని బహిరంగ విమర్శలకు దిగకుండా కట్టడి చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా 'ఈటెల'ను సొంత మండలంలో దెబ్బతీయడానికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం పొరుగున
ఉన్న ఎమ్మెల్యేలను రంగంలోకి దించింది. ఈ మండలంలోని రెడ్డి, వెలమ సామాజిక వర్గాల నేతలను పిలుచుకొని పార్టీ సరైన గౌరవమిస్తుందని హామీలు ఇస్తూ 'ఈటెల'కు దూరం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
మండలంలో ఎత్తులు.. పైఎత్తులు
'ఈటెల' సొంత మండలం కమలాపూర్ మండలంలో 'ఈటెల'ను ఒంటరి చేయడానికి పొరుగన ఉన్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని రంగంలోకి పార్టీ నాయకత్వం దించింది. మూడ్రోజులుగా 'చల్లా' టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలను పిలుచుకొని చర్చలు జరుపుతున్నారు. కేడరంతా టీఆర్ఎస్లోనే కొనసాగేలా వారికి హామీ ఇస్తున్నారు. పార్టీ అధికారంలో ఉందని, ఎలాంటి పనులున్న చేసుకోవచ్చని, నామినేటెడ్ పదవులు దక్కుతాయని హామీ ఇస్తూ సదరు నేతలను 'ఈటెల'కు దూరం చేసి టీఆర్ఎస్లో కొనసాగేలా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మండలంలో 24 మంది ఎంపీటీసీలుగా ఇందులో 14 మంది ఎంపీటీసీలు టీఆర్ఎస్కు చెందిన వారే కాగా, ఇందులో 7గురు ఎంపీటీసీలు 'ఈటెల' శిబిరంలో ఉన్నారు. మరో 7గురు టీఆర్ఎస్లోనే కొనసాగుతామని ప్రకటించారు. మండలంలో 24 గ్రామ పంచాయతీలుండగా, ముగ్గురు సర్పంచ్‌లు ఇప్పటివరకు టీఆర్ఎస్లో కొనసాగుతామని ప్రకటించారు. మిగతా 20 మంది టీఆర్ఎస్కు చెందిన సర్పంచ్‌లు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో ఫోన్లో చర్చలు..
కమలాపూర్ మండలంలోని ఎంపీటీసీలతో మంత్రి గంగుల కమలాకర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఫోన్లో చర్చలు జరిపారు. మండలంలో ఎంపీటీసీలందరినీ టీఆర్ఎస్లో కొనసాగేలా చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు ఇండిపెండెంట్లు ఎంపీటీసీలుగా గెలవగా వారు టీఆర్ఎస్లో చేరారు. వారిద్దరూ టీఆర్ఎస్లో కొనసాగడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే 24 మంది సర్పంచ్‌ల్లో ఇప్పటివరకు 3గ్గురు మాత్రమే బహిరంగంగా టీఆర్ఎస్లో కొనసాగుతామని ప్రకటించారు. మిగతా 20 మంది సర్పంచ్‌లను దారిలోకి తెచ్చుకోవడానికి మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే తెర వెనుక మొత్తం వ్యవహారాన్ని 'బోయినపల్లి' సమన్వయం చేస్తున్నట్లు సమాచారం. వ్యవహారమంతా కొలిక్కి వస్తే మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచ్‌లందరితో ప్రెస్‌మీట్ పెట్టించి టీఆర్ఎస్లో కొనసాగుతున్నట్లు ప్రకటింపచేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
నలిగిపోతున్న కేడర్..
హుజురాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో మరీ ముఖ్యంగా కమలాపూర్ మండలంలో టీఆర్ఎస్ కేడర్ అటు అధిష్టానం, ఇటు 'ఈటెల' వర్గంతో నలిగిపోతున్నారు. 'ఈటెల' పలువురు అనుచరుల పట్ల వ్యతిరేకత ఉన్న పలువురు ప్రజాప్రతినిధులు 'ఈటెల'కు వ్యతిరేకంగా వెళ్లడానికి ఇష్టపడడం లేదు. ఇదే క్రమంలో మరో రెండున్నరేండ్లు రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండనుంది. ఈ క్రమంలో పార్టీకి దూరమైతే అభివృద్ధి పనులు చేసుకోలేమన్న అభద్రతాభావంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులున్నారు. ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఈ విషయంలో నలిగిపోతున్నారు. ఇదే అదునుగా పార్టీ అధిష్టానం కేడర్నంతా పార్టీలో కొనసాగేలా చేయడానికి అభివృద్ధి పనులనే అస్త్రంగా చేసుకొని చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో నియోజకవర్గంలో అనుక్షణం సమీకరణలు మారుతున్నాయి.
అయోమయంలో కేడర్..
మంత్రి గంగుల కమలాకర్ వద్దకు వెళ్లి టీఆర్ఎస్లోనే కొనసాగుతామని ప్రకటించిన నేతలు సైతం 'ఈటెల' హుజురాబాద్‌కు రాగానే ఆయన వద్దకు వచ్చి 'ఈటెల' నాయకత్వంలోనే పని చేస్తామని ప్రకటించారు. వీణవంక ఎంపీపీ రేణుక ఈ మేరకు ప్రకటన చేశారు. హుజురాబాద్ మున్సిపల్ చైర్మెన్ రాధిక ముందు 'ఈటెల' మచ్చలేని నాయకుడని, ఆయనతోనే ఉంటామని ప్రకటించారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ వద్దకు వెళ్లి టీఆర్ఎస్లోనే కొనసాగుతామని ప్రకటించారు. జమ్మికుంట మున్సిపల్ చైర్మెన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు తొలుత 'ఈటెల' కడిగిన ముత్యమని, ఆయన నాయకత్వంలోనే పని చేస్తామని ప్రకటించారు. అనంతరం టీఆర్ఎస్లోనే కొనసాగుతామని చెప్పారు. జమ్మికుంట మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ దేశిని స్వప్న మరికొంత మంది కౌన్సిలర్లు కలిసి 'ఈటెల' నాయకత్వంలో పనిచేస్తామని ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారం క్షణక్షణం అయోమయం, గందరగోళంగా మారింది. ఏ నేత, ఏ ప్రజాప్రతినిధి ఎప్పుడు ఎలా స్పందిస్తారో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. దీనికి తెరవెనుక టీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగింపులు, హామీలు, బెదిరింపులే కారణమని ప్రచారం జరుగుతోంది.