Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంజీఎంకు 250 ఆక్సీజన్ ఫ్లోమీటర్లు
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-వరంగల్
ఉమ్మడి వరంగల్ జిల్లాకు, హైద్రాబాద్ టిమ్స్ ఆస్పత్రి కోసం స్త్రీనిధి కింద రూ.50 లక్షల విలువైన ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్లను కొనుగోలు చేసి ఇచ్చామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. గురువారం హన్మకొండ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్‌లో జిల్లా కలెక్టర్లకు మంత్రి ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్లను అందజేశారు. అంతకుముందు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషీ, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, ఆర్ఎంఓలతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన కోవిడ్ చికిత్స, అవసరమైన మౌలిక వసతులు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. కోవిడ్ వార్డును పీపీఈ కిట్ ధరించి మంత్రి దయాకర్‌రావు స్వయంగా పరిశీలించారు. ప్రతి వార్డు ఎప్పటికప్పుడ పారిశుద్ధ్యం సరిగ్గా చేయించాలన్నారు. ఈ సందర్భంగా కోవిడ్ పేషంట్లను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడారు. హైద్రాబాద్ టిమ్స్ ఆస్పత్రికి 10, పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పులకు 4, కొడకండ్లకు 3, పాలకుర్తికి 3, తొర్రూరుకు 10, రాయపర్తికి 4, వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరికి 4, ఎంజీఎం ఆస్పత్రికి 5 ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్లను కేటాయించినట్లు చెప్పారు. ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స కోసం అన్ని వసతులను కల్పించామన్నారు. ముఖ్యమంత్రి చొరవతో ఎంజీఎం ఆస్పత్రికి, సిబ్బందికి కూడా అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఎంజీఎం రూపురేఖలను మార్చాలన్న దృఢ నిశ్ఛయంతో ఉన్నారని తెలిపారు. పీపీఈ కిట్ వేసుకోకుండా సీఎం సాహసోపేతంగా గాంధీ ఆస్పత్రిని సందర్శించి కరోనా బాధితులకు ధైర్యాన్ని కలిగించారని చెప్పారు. ప్రధానికి గుజరాత్ తప్ప ఇతర రాష్ట్రాలు కనిపించడం లేదన్నారు. కేంద్రం సహకరించకున్నా వ్యాక్సిన్ కొరతను తీర్చడానికి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజారోగ్యం బాగుందన్నారు. ప్రయివేట్ ఆస్పత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకునేలా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా చికిత్స కోసం మందులు, ఆక్సీజన్ సరఫరాకు ఇబ్బందులు లేవన్నారు. ఎంజీఎం ఆస్పత్రికి మరో 275 ఆక్సీిజన్ ఫ్లో మీటర్లు సమకూర్చామని వివరించారు. కరోనా పేషంట్ల నుంచి ప్రయివేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు అధిక బిల్లులు వసూలు చేస్తున్నాయన్న ఫిర్యాదులపై మంత్రి సీరియస్‌గా తీసుకొని రెగ్యులర్‌గా తనిఖీలు నిర్వహించి ప్రయివేట్ ఆస్పత్రులపై ఎప్పటికప్పుడు టాస్క్‌ఫోర్స్ కమిటీ నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. కమిటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు వరంగల్, హన్మకొండలోని పలు ప్రయివేట్ ఆస్పత్రులపై టాస్క్‌ఫోర్స్ కమిటీలు తనిఖీలు చేసి నివేదికలు మంత్రికి అందించాయి. టెస్ట్‌ల కోసం ఎవరూ తిరుగకూడదన్నారు. ఏమైనా లక్షణాలుంటే ఏఎన్ఎం, ఆశావర్కర్ల వద్దనున్న కిట్లను ఉపయోగించుకోవాలని సూచించారు. అన్ని రకాల మందులతో కూడిన కిట్లను వారి దగ్గర ఉంచామని తెలిపారు.