Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుండ్ల సాగర్ దునుకుల్లవాగు కేంద్రంగా అక్రమ రవాణా
- మోటార్ సాయంతో ఇసుక ఫిల్టర్
- సీసీ కెమెరాలకు చిక్కకుండా వీధిలైట్లు బంద్
-పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-వేలేరు
మండలంలోని గుండ్ల సాగర్ గ్రామంలోని దునుకుల్ల వాగు పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా రాత్రిపూట జోరుగా సాగుతోంది. గుండ్ల సాగర్ గ్రామ శివారులోని దునుకుల్ల వాగు మళ్లీకుదుర్ల, గుండ్ల సాగర్ మీదుగా వెళ్తున్న దునుకుల్ల వాగును టార్గెట్ చేసుకొని ఇసుక బకాసురులు ఇసుకను రాత్రికి రాత్రే గ్రామాలు దాటిస్తున్నట్టు స్థానిక ప్రజలు వాపోతున్నారు. గ్రామంలోని కొంత మంది వ్యక్తులు కలిసి ఈ అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని గ్రామంలో చీకటి పడగానే రాత్రి 8 నుంచి తెల్లవారు 4 గంటల వరకు ట్రాక్టర్లు తీసుకొని అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. లాక్డౌన్ కూడా ఈ అక్రమ ఇసుక రవాణాకు అనుకూలంగా మారుతున్న వైనం ఉందని ప్రజలు వాపోతున్నారు. రాత్రికి రాత్రే ట్రాక్టర్లలో ఇసుక నింపుకొని ఊరి చివర పెట్టుకుంటారు. ఇసుక రవాణా జరుగుతున్న సమయంలో దందాకి పాల్పడుతున్న వ్యక్తులకు సంబ ంధించిన ఒక వ్యక్తి వీధిలైట్లు బందు చేసి సీసీ కెమెరాలకు దొరకకుండా తప్పించుకుంటున్న పరిస్థితి ఉందని ప్రజలు తెలుపుతున్నారు. మండలంలోని పలు గ్రామాలకే కాకుండా పక్క మండలాలకు కూడా ఈ ఇసుక రవాణా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు మెండుగా ఉన్నాయి. మండలంలోని గుండ్ల సాగర్, మల్లికుదుర్ల, పీచర, వేలేరు గ్రామాలలోని వాగులలో ప్రతి రోజు ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నా పట్టించుకునే నాధుడే లేడని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధి కారులకు, నాయకులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని ఇట్టి అక్రమ ఇసుక రవాణా వెనుక బడా నాయకుల పాత్ర ఉండటం వల్లే ఇసుక రవాణా మూడు పువ్వులు ఆరు కాయలు విరాజిల్లుతుందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా గ్రామాలలోని వాగుల్లో అక్రమ ఇసుక రవాణాకు అధికారులు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.