Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాతో ఉపాధి కోల్పోయిన వైనం
- ఫొటో, వీడియోగ్రాఫర్లు సతమతం
- కుటుంబ పోషణకు అప్పులు
నవతెలంగాణ-నర్సింహులపేట
ఏడాదిన్నరగా జనాన్ని వణికిస్తున్న కరోనా ఫొటో, వీడియోగ్రఫర్ల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఉపాధి లేక కెమెరా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. శుభకార్యాల సమయంలోనే కరోనా వైరస్ విజంభించడం, ప్రభుత్వాలు లాక్డౌన్, కర్ఫ్యూ విధించడంతో ఫొటో, వీడియోగ్రాఫర్ల ఉపాధికి దెబ్బ పడింది. ఫొటోలు, వీడియోలు తీయడం తప్ప ఇతర పనులు తెలియక కుటుంబ పోషణ కోసం పడరాని పాట్లు పడుతునానరు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ప్రయివేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీపై అప్పు చేసి బతుకులు వెళ్లదీస్తున్నారు. అనేక అద్భుత చిత్రాలకు ప్రాణం పోసిన ఫొటో, వీడియోగ్రాఫర్లు తమ బతుకు చిత్రాన్ని మార్చిన కరోనాతో చితికిపోతున్నారు.
లాక్‌డౌన్‌తో అతలాకుతలం
ఏటా మార్చి నుంచి జూలై వరకు పెండ్లిళ్ల సీజన్ ఉంటుంది. ఆ తర్వాత 8 నెలల పాటు ముహూర్తాలను బట్టి అడపాదడపా ఫంక్షన్లు ఉంటాయి. గతేడాది ఏడాది మార్చి నుంచి ఐదు నెలల పాటు కరోనాతో పెండ్లిళ్ల సీజన్ గిరాకీ కరువైంది. ఈ ఏడాది సీజన్లో ఒక్క ఫొటోగ్రాఫర్‌కు మే, జూన్ నెలలో వెడ్డింగ్‌ల కోసం రెండు, మూడు నెలల నుంచి బుకింగ్‌లు వచ్చాయి. పరిస్థితి కొంత మెరుగు పడుతోందనుకున్న తరుణంలో ప్రభుత్వం మళ్లీ లాక్డౌన్ విధించడంతో వివాహాలు వాయిదా పడ్డాయి. దీంతో ఫొటోగ్రాఫర్ల ఆశలు ఆవిరయ్యాయి.
రాకపోకలను అనుమతించక..
ప్రభుత్వం వివాహాలకు అనేక ఆంక్షలతో అనుమతి ఇచ్చినా ఫొటో, వీడియోగ్రాఫర్ల రాకపోకలను అనుమతించడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వెడ్డింగ్ కార్డు ఉన్న వారినైనా కార్యక్రమాలకు అనుమతించాలని ఫొటోగ్రాఫర్లు వేడుకుంటున్నా పోలీసులు కనికరించడం లేదన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. సంస్థ జారీ చేసిన గుర్తింపు కార్డు కలిగిన, సరైన ఆధారాలు చూపిన ఫొటో, వీడియోగ్రాఫర్లను అనుమతించేలా ప్రభుత్వం పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేయాలని ఫొటో, వీడియోగ్రాఫర్లు కోరుతున్నారు.
అనుమతించాలని తహసీల్దార్‌కు వినతి
వివాహాలు, ఇతర శుభకార్యాలకు వెళ్లేలా ఫొటో, వీడియోగ్రాఫర్లకు అనుమతిస్తూ పాస్‌లు జారీ చేయాలని కోరుతూ తహసీల్దార్ ఇమ్మానియేల్‌ను ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు నగేష్ ఆధ్వర్యంలో వినతిపం అందించారు. ఈ సందర్భంగా నగేష్ సమస్యలను తహసీల్దార్‌కు వివరించారు. ఏడాదిగా తాము పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వ పెద్దలు, అధికారులు గమనించాలని కోరారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పలువురు ఫొటో, వీడియోగ్రాఫర్లు ఆత్మహత్యకు పాల్పడుతున్న దుస్థితి నెలకొందని ఆందోళన వెలిబుచ్చారు. ఫొటోలు, వీడియోలు తీస్తేనే తమకు పూట గడుస్తుందని తెలిపారు. ఫొటో, వీడియోగ్రఫీకి అనుమతిస్తూ పోలీసులు, జిల్లా ఉన్నతాధికారులు సహకరించాలని కోరారు.