Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
స్వరాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకులు విఫల మయ్యారని ఏఐఎఫ్బీ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి ప్రజలు అనేక సమస్యలతో అల్లాడుతున్నారని అన్నారు. ఒక వ్యక్తి మరణిస్తే స్మశానానికి తీసుకెళ్లడానికి వైకుంఠ రథం అందుబాటులో లేదని, శవాన్ని పూర్చడానికి జేసీబీ కూడా లేదన్నారు. శ్మశానవాటికలో ఒక బోరు పర్మినెంట్ గా వేయా లన్నారు. స్త్రీ లు దుస్తులు మార్చుకోవడానికి గదులు లేవన్నారు. మిషన్ భగీరథ నీళ్ళు అందిచడంలో విఫలమయ్యారని అన్నారు. కరోనా టెస్ట్‌లకు ఉదయం 5గంటలకే వచ్చి లైన్ లో ఉంటున్నా మధ్యాహ్నం వరకు టెస్ట్ చేయట్లేదన్నారు. టెస్ట్ కిట్ల సంఖ్య పెంచి మరికొన్ని క్యాంప్‌లు ఏర్పాటు చేయాలన్నారు. భూపాలపల్లి అభివృద్ధి పథంలో ఉందని చెబుతున్న టీఆర్ఎస్ నాయకులకు స్థానిక సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రూ.70 కోట్లు తో మిషన్ భగీరథ నీరందిస్తామని శిలా ఫలకం వేసి ఏడాదవుతున్నా పనులు పూర్తి కాలేదన్నారు. సమస్యలున్నవి నిజం కాకుంటే తాము రాజీనామా చేస్తామన్నారు. లేదంలే మీరు రాజీనామా చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్, కుర్మిళ్ళ రజిత శ్రీనివాస్, ఉడుత సరోజన- రాయమల్లు, అంబాల శ్రీనివాస్, మహేందర్, పిప్పాల రాజేందర్, రజినీకాంత్, రాజేష్, సంతోష్, బుర్ర సాగర్, దేవేందర్, సునీల్, గండ్ర సత్తన్న వర్గం ముఖ్య నాయకులు పాల్గొన్నారు.