Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీలర్లతో సమావేశం-షాపుల్లో తనిఖీ
నవతెలంగాణ-నెల్లికుదురు
విత్తన వ్యాపారులు నాణ్యమైన వాటినే విక్రయించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (డీఏఓ) ఛత్రునాయక్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని రైతు వేదిక భవన్లో టాస్క్ఫోర్స్ టీమ్, ఎస్సై పత్తిపాక జితేందర్, ఏఓ నెలకుర్తి రవీందర్రెడ్డిలతో కలిసి బుధవారం డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ ఛత్రునాయక్ మాట్లాడారు. వ్యాపారస్తులు ప్రభుత్వం అందించిన విత్తనాలను మాత్రమే విక్రయించాలని సూచించారు. తేడా వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధిక రేట్లకు విత్తనాలు, పురుగుమందులు విక్రయించినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రైతులు ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఈ-పాస్ ద్వారా విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేయాలని చెప్పారు. రైతులను మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మండల కేంద్రంలోని లక్ష్మీ ఫెర్టిలైజర్స్, మంజునాధ ఆగ్రో ఏజెన్సీస్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల్లో టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏడీఏ లక్ష్మీనారాయణ, షాపుల నిర్వాహకులు యాకన్న, శంకర్, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
గూడూరు : మండల కేంద్రంలోని ఆగ్రోస్, విత్తన షాపుల్లో ఎస్సై సతీష్, ఏఓ రాకేష్ బుధవారం తనిఖీ నిర్వహించారు. సీజన్ ప్రారంభం అవుతున్న తరుణంలో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని చెప్పారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని తెలిపారు. విత్తన విక్రయాల్లో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్టాక్ వివరాలను బోర్డుపై ప్రదర్శించాలని తెలిపారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు, పురుగు మందులకు సంబంధించి బిల్లు తప్పకుండా ఇవ్వాలని స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.