Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లెర్నింగ్ సెంటర్లకు బెంచీలు, వాటర్ ప్యూరిఫయర్లు
- గిరిజనులకు సరుకులతో కూడిన స్మైల్ కిట్ల పంపిణీ
నవతెలంగాణ-తాడ్వాయి
కరోనా ఉధృతి నేపథ్యంలో గొత్తికోయ పేదలకు నిట్ ఎంబీఏ-2011, పూర్వవిద్యార్థులు ఏర్పాటు చేసిన అభయహస్తం ఫౌండేషన్ అండగా నిలుస్తోంది. తాడ్వాయి, ఏటూరునాగారం, గోవిందరావుపేట మండలాల పరిధిలోని గుత్తికోయల కోసం ఊరట్టం, చింతలమోరి, రాయబంధం, టేకుమట్ల గ్రామాల్లో ఫౌండేషన్ ఏర్పాటు చేసిన లెర్నింగ్ సెంటర్లకు శుక్రవారం బెంచీలు, వాటర్ ప్యూరిఫయర్లు అందించారు. అలాగే గొత్తికోయ పేదలకు సరుకులతో కూడిన స్మైల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు తాడిశెట్టి కార్తీక్, కార్యదర్శి నిఖిల్ మాట్లాడారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాడ్వాయి, ఏటూరునాగారం, గోవిందరావుపేట మండలాల్లోని ఊరట్టం, చింతలమోరి, రాయబంధం, టేకులకుంట గ్రామాలను దత్తత తీసుకుని గొత్తికోయ బాలల చదువుల కోసం 4 లెర్నింగ్ సెంటర్లను గతంలోనే ఏర్పాటు చేశామన్నారు. వాటిల్లో విద్యార్థులు కూర్చునేందుకు తాజాగా శుక్రవారం నాడు 18 బెంచీలు, 4 వైట్ బోర్డులు, 4 వాటర్ ప్యూరిఫయర్లు, 4 తాటిపత్రిలతోపాటు పుస్తకాలు, బట్టలు, ఆటవస్తువులు, 400 కేజీల బియ్యం, 15 రోజులకు సరిపడేలా 4 రకాల కూరగాయలు, 80 కేజీల పప్పులు, 45 కేజీల నూనె, 30 కేజీల కారం, పసుపు, సబ్బులు, పేస్టులు దాతల సహకారంతో అందించినట్టు తెలిపారు. అలాగే మహిళల కోసం శానిటరీ న్యాప్కిన్లు, పిల్లల కోసం పౌష్టికాహారం అందజేసినట్టు చెప్పారు. లెర్నింగ్ సెంటర్లలో విద్యను బోధించేందుకు ఉపాధ్యాయులను నియమించామని, ప్రతిరోజూ తరగతులు నిర్వహించేలా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో శివ, ప్రశాంత్, రవీంద్ర, లక్ష్మణ్, దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.