Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాసంగి ముగిసినా ధాన్యం చిక్కులు
- కొనుగోలు కేంద్రాల్లో ఐదు లక్షల కింటాలు
- కాంటా కాక.. మిల్లుకు తరలించక వెతలు
- మహబూబాబాద్ జిల్లాలో దుస్థితి
నవతెలంగాణ-మహబూబాబాద్
యాసంగి ముగిసింది. వానాకాలం ప్రారంభమైంది. తొలకరి రాష్ట్రాన్ని పలకరించాయి. రైతులు విత్తనాల వేటలో పడ్డారు. అయినా ధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తి కాలేదు. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే ఉంది. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. పెట్టుబడుల కోసం అప్పు తెచ్చి రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పోసి నెలలు గడుస్తున్నా బస్తాలు నింపి కాంటా వేయడం లేదు. కాంటా వేసినా మిల్లుకు తరలించడం లేదు. ఈ పరిస్థితిలో రైతన్నలు తీవ్ర వేదనకు గురౌతున్నారు. గ్రామాల్లో బడా రైతులు అధికార పార్టీ అండతో, వ్యక్తిగత పలుకుబడితో కొనుగోలు కేంద్రాల్లో ముందుగానే కాంటా వేయించుకుని మిల్లులకు తరలించుకుని బిల్లులు తీసుకున్నారు. పేద, మధ్య తరగతి రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా కోసం, మిల్లుకు తరలింపు కోసం ఒళ్లంతా కండ్లు చేసుకుని ఎదురు చూస్తున్నారు. మరో వారం రోజుల్లో కొనుగోళ్లు ముగియనుండగా జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అలాగే ఉంది.
జిల్లావ్యాప్తంగా 25 శాతం ధాన్యం ఇంకా కాంటా కాలేదు. మిల్లులకు తరలించలేదు. ఓ వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తే పరిస్థితి ఉండగా మరోవైపు హమాలీలు లేక కాంటా కాక, రవాణా లారీలు రాక, వచ్చినా రైస్ మిల్లులో అన్లోడింగ్ చేసే హమాలీల కొరతతో ఇబ్బంది నెలకొంది. మహబూబాబాద్ నుంచి ఇతర జిల్లాలకు ధాన్యం తరలించే పరిస్థితి నెలకొంది. రైసు మిల్లులు నిండిపోవడంతో మిల్లర్లు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, పెద్దపల్లి, తదితర జిల్లాలకు ధాన్యాన్ని పంపుతున్నారు. ఇప్పటివరకు 3.15 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని ఇతర జిల్లాలకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 16 మండలాల్లో లక్షా 76 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. జిల్లాలో 170 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 162 కేంద్రాలు ప్రారంభించారు. ఇందులో ఇప్పటికే 19 కేంద్రాలు మూతపడ్డాయి. జిల్లావ్యాప్తంగా 19.56 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రాగా అందులో 30 వేల 764 మంది రైతులకు చెందిన 14.37 లక్షల ధాన్యం కొనుగోలు చేశారు. సదరు రైతులకు రూ.322 కోట్లు చెల్లించారు. ఇంకా 2.71 లక్షల క్వింటాళ్ల ధాన్యం కాంటా పూర్తై లారీల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. మరో 2.47 క్వింటాళ్ల ధాన్యం రాసుల రూపంలో కాంటా కాకుండా ఉంది. జిల్లావ్యాప్తంగా రైస్ మిల్లుల్లో అన్లోడింగ్ అలక్ష్యంతోనే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా ఇంకా 50 వేల మంది రైతులు బ్యాంకులో డబ్బులు జమ కాక పడిగాపులు కాస్తున్నారు.