Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నష్టదాయక చట్టాల ప్రతులు దగ్ధం చేసి నిరసన
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంపూర్ణ క్రాంతి దివస్ సక్సెస్
నవతెలంగాణ-న్యూశాయంపేట
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీలు రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని ఏఐకేఎస్‌సీసీ నాయకులు విమర్శించారు. ఏఐకేఎస్‌సీసీ జాతీయ కమిటలీ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం తలపెట్టిన సంపూర్ణ క్రాంతి దివస్ సక్సెస్ అయ్యింది. వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, జనగామ జిల్లా కేంద్రాలతోపాటు నర్సంపేట, కేసముద్రం, తొర్రూరు, మరిపెడ, తొర్రూరు, ఏటూరునాగారం, పరకాల, తదితర పట్టణాల్లో, అన్ని మండల కేంద్రాల్లో అఖిలపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నష్టదాయక చట్టాల ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలను ఎండగట్టారు. పాలకులు అవలంభిస్తున్న కార్పొరేటు అనుకూల, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతులు ఐక్యఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
హన్మకొండలోని అంబేద్కర్ సెంటర్లో ఏఐకేఎస్‌సీసీ నాయకులు రైతు వ్యతిరేక చట్టాల ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు సారంపల్లి వాసుదేవరెడ్డి రాచర్ల బాలరాజు, హంసారెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నష్టదాయక నల్ల చట్లాల ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏడాది గడచిన సందర్భంగా తలపెట్టిన క్రాంతి దివస్‌ను విజయవంతం చేయడం ద్వారా ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలోని బడా కార్పొరేట్, విదేశీ బహుళజాతి సంస్థలకు అనుకూలంగా చేసిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఏడాదిగా ఉద్యమిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యమాలను అణచివేస్తూ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తోందని, లాఠీచార్జీ చేయిస్తూ అమానుషంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సదరు నష్టదాయక బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనే కాకుండా పలు రాష్ట్రాల్లో రైతులు ఉద్యమిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం మొదట రైతు పక్షాన నిలిచినట్టు నటించి తదనంతరం కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలపై నోరు మెదపడం లేదని మండిపడ్డారు. సదరు నష్టదాయక చట్టాలను రద్దు చేసే వరకు ఆందోళనలు కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు బీరం రాములు, బాబన్న, మండల యుగంధర్, నెట్టెం నారాయణ, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు నున్నా అప్పారావు, హరిబాబు, రాములు, తదితరులు పాల్గొన్నారు.
ములుగు : సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాల ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడారు. కోవిడ్‌తో ప్రజలు అల్లాడుతున్న తరుణంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మోసపూరితంగా చట్టాలను రూపొందించి ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిందని విమర్శించారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాల అమలైతే రైతులు వారి భూముల్లోనే కూలీలుగా మారే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బోడ రమేష్, నాయకులు మచ్చ రవి, పార్శి గోపీ, తదితరులు పాల్గొన్నారు.
తొర్రూర్ టౌన్ : తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో అమ్మాపురం గ్రామంలో రైతు వ్యతిరేక చట్టాల ప్రతులను దగ్ధం చేశారు. సీపీఐ, రైతు సంఘం నాయకులు గణపురం లక్ష్మణ్, బానోత్ నర్సింహ, అజ్మీరా వీరన్న మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు గుగులోతు లచ్చిరామ్, నక్క వెంకన్న, దొనక వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
బయ్యారం : మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక చట్టాల ప్రతులను దగ్ధాం చేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, జిల్లా అధ్యక్షుడు జగ్గన్న, రైతు సంఘం జిల్లా నాయకులు మండ రాజన్న, రైతు కూలీ సంఘం నాయకులు సైదులు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు రామగిరి భిక్షం, తుడుం వీరభద్రం, బిల్లకంటి సూర్యం, నంబూరి మధు, తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు : తొర్రూరు పట్టణంలో రైతు వ్యతిరేక చట్టాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ సీనియర్ నాయకుడు ఓమ భిక్షపతి, న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి కొత్తపెల్లి రవి, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు మల్లయ్య, షరీఫ్, సంతోష్, చరణ్, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
కేసముద్రం : మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంబటి మహేందర్‌రెడ్డి, సీపీఐ(ఎం) నాయకుడు జల్లి జయరాజ్, సీపీఐ మండల కార్యదర్శి చొప్పరి శేఖర్, ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి కంచె వెంకన్న, సీపీఐ(ఎంఎల్) జిల్లా నాయకుడు శ్రీధర్, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకుడు జంపాల మల్లేశం, మరిపెల్లి మొగిలి, ఎల్లయ్య, బిచ్చానాయక్, తదితరులు పాల్గొన్నారు . అలాగే కాట్రపల్లిలో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక చట్టాల ప్రతులను దగ్ధం చేశారు. కార్యక్రమంలో నాయకులు కామగోని శ్రవణ్, మోడెం వెంకటాద్రి, గడ్డం రవి, ఆకుల రవి, తదితరులు పాల్గొన్నారు.
నెల్లికుదురు : మండలంలోని మేచరాజుపల్లి, బంజర గ్రామాల్లో అఖిల భారత కూలీ సంఘం ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక చట్టాల ప్రతులను దగ్ధం చేశారు. అనంతరం ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న, జిల్లా నాయకుడు జక్కుల యాకయ్య, పీవైఎల్ జిల్లా నాయకుడు ఇరుగు అనిల్ మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు కేశవులు, సతీష్, రవీందర్, వెంకన్న, సైదులు, నాగులు, బాషా, తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్ శక్తుల కోసమే.. : సీపీఐ(ఎం)
మహబూబాబాద్ : కార్పొరేట్ శక్తులకు లబ్ది చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు చేసిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద సెంటర్లో సీపీఐ(ఎం), న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక జీఓ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సాదుల శ్రీనివాస్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండల వెంకన్న మాట్లాడారు. రైతు వ్యతిరేక చట్టాలు వచ్చి ఏడాది పూర్తయ్యిందని చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి సదరు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీల నాయకులు గునిగంటి రాజన్న, అల్వాల వీరయ్య, సమ్మెట రాజమౌళి, లింగన్న, పర్వత కోటేష్, ఐలయ్య, యాకయ్య, భాస్కర్, రాజు, భీమ, తదితరులు పాల్గొన్నారు.