Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
మగశిర కార్తిని చేపల పండుగగా గుర్తించి, అధికారికంగా నిర్వహించాలని మత్స్యకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మునిగెల రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో నాగుల చెరువులో మత్స్యకారులు పడుతున్న చేపలను పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉచిత చేప పిల్లలకు బదులు సొసైటీకి నేరుగా చెక్కులు అందజేయాలని కోరారు. ఉచిత చేప పిల్లల పంపిణీలో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారని, తద్వారా కాంట్రా క్టర్లకు లాభం చేకూరుతుందని వాపోయారు. సరైన నాణ్యత గల చేప రకంపిల్ల వేయకపోవడం వల్ల చేపలు పెరుగు తలేవన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వల్ల మత్స్య కారులు తీవ్రంగా నష్టపోతున్నారని, లాక్ డౌన్ తో చేపల అమ్మకానికి ఆటంకం ఏర్పడుతుందని, సరైన మార్కెట్ విధానంలేక మత్స్యకారులు నష్టపోతున్నారని అన్నారు. చేపలకు మద్దతు ధర ప్రకటించాలని, తెల్ల చేపలకు 300, నల్ల చేపలకు 600 ధర ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మత్స్యకారులకు రుణాలు మంజూరు చేయాలని, కరోనా కాలంలో ప్రతి మత్స్యకార కుటుంబానికి నెలకు 7500 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు అన్నెపు రమేష్, పిట్టల శ్రీనివాస్, పెండ్యాల వనరాయుడు, లింగనబోయిన జనార్ధన్, పిట్టల రాజేందర్, మునిగెల సోమేశ్వర్, తొడెంగల వెంకటయ్య, మొగిలి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.