Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెల రోజులు గడుస్తున్నా ఖాతాలో డబ్బు జమ కాని వైనం
- 72 గంటల్లో చెల్లిస్తామన్నది ఉత్త మాటే
- ధాన్యం కొనుగోలు పత్రాలు అందించడంలో నిర్వాహకుల నిర్లక్ష్యం
నవతెలంగాణ-శాయంపేట
రైతులు పండించిన వరి ధాన్యాన్ని తూకం వేసిన 72 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదు. అన్నదాతలు ఆరుగాలం శ్రమించి వరి పంట సాగు చేయగా పండించిన పంటను గ్రామాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించగా నెల రోజులు గడుస్తున్నప్పటికీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. ఇదే విషయమై రైతులు నిర్వాహకుల దష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వానకాలం సమీపించడం, తొలకరి జల్లులు కురు స్తుండడంతో వరి ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులతో పంట సాగు పెట్టుబడికి ఉపయోగపడతాయని అన్నదాతలు ఎదురు చూస్తు న్నారు. మండల పరిధిలోని గ్రామాలలో పి ఎస్ సి ఎస్, ఐకెపీ, ఓడీసీఎంఎస్, రైతు సంఘాల ఆధ్వర్యంలో 13 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తు న్నారు. రవాణా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల లారీలు అరకొరగా పంప డంతో విషయం తెలుసుకున్న గండ్ర దంపతులు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో మాట్లాడి వరంగల్ లారీ అసోసియేషన్ పాలకవర్గం తో మాట్లాడి ధాన్యాన్ని మిల్లులకు తరలించారు.
నెల గడుస్తున్న డబ్బులు జమ కానీ వైనం
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు తమ ధాన్యాన్ని తూకం వేసి నెల రోజులు గడిచినప్పటికీ ఇప్పటివరకు తమ బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండ లంలోని ప్రగతి సింగారం గ్రామంలో ఏప్రిల్ 25న పిఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. అప్పటినుంచి రైతులు ధాన్యం విక్రయించిన ప్పటికీ ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని రైతులు మండి పడుతున్నారు. ఇదే విషయాన్ని నిర్వాహకుల దష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఊసేలేని కొనుగోలు పత్రాల పంపిణీ
రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం నిర్వాహకులు తూకం వేయగానే సంబంధిత రైతుకు ఎన్ని బస్తాలు తూకం వేసారో అన్ని బస్తాలకు కొనుగోలు పత్రాలు నిర్వాహకులు జారీ చేయాలి. గతంలో కొనుగోలు పత్రాలు జారీ చేశారని, పీఏసీఎస్, ఐకేపీ, ఒడీసీఎమ్మెస్, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఇటీవల కాలంలో రైతులకు ఇవ్వాల్సిన కొనుగోలు పత్రాల పంపిణీ ఊసే ఎత్తడం లేదు. దీంతో రైతుకు ఎన్ని బస్తాలు విక్రయించారో ఆధారం లేకుండా పోతుంది. కొనుగోలు పత్రాలు నిర్వాహకులు జారీ చేయడం వల్ల ఆధారం లభించినట్లు అవుతుందని రైతులు తెలుపుతున్నారు. కాగా నిర్వాహకులు మాత్రం రైస్ మిల్లర్లు బస్తాలలో కోత విధిస్తే తాము నష్టపోవాల్సి వస్తుందని అందుకే కొనుగోలు పత్రాలు జారీ చేయడం లేదని నిర్వాహకులు తెలపడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేయగానే కొనుగోలు పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
ట్రక్ షీట్ల జారీతోనే ఆలస్యం
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన ధాన్యాన్ని లారీల లో రైస్ మిల్లర్లకు ఎగుమతి చేయగా అక్కడ వేబ్రిడ్జి ఆధారంగా రైస్ మిల్లర్ల యజమాన్యం ట్రాక్షీట్ జారీ చేస్తారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ట్రక్ షీట్ ఆధారంగా రైతుల పేర్లు, ధాన్యం బస్తాల వివరాలు, బ్యాంక్ ఖాతా నెంబర్, ఆధార్ నెంబర్, పట్టా పాస్ పుస్తకం నెంబర్ ట్యాబ్ ద్వారా ఆన్లైన్లో పొందుపరుస్తారు. దీని ఆధారంగానే రైతుల ఖాతాల్లో దాన్యం డబ్బులు జమ అవుతాయి. ఇంత వరకు బాగానే ఉన్నా రైస్ మిల్లులలో వే బ్రిడ్జి వేశాక ట్రక్ షీట్ అందజేయడంలో ఆలస్యం అవు తుండటంతో ట్యాబ్ లలో పొందుపరచ లేక రైతుల ఖాతాల్లో డబ్బు లు జమ కావడం లేదు. ఇప్పటికైనా ఉన్నతా ధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల పై దష్టి సారించి రైతుల ఖాతాల్లో డబ్బులు త్వరగా జమ అయ్యేలా చూడాలని రైతులు వేడుకుంటున్నారు.