Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్జి రాధికా జైస్వాల్ సాయం
నవతెలంగాణ-మహబూబాబాద్
లాక్డౌన్ నేపథ్యంలో పని లేక ఉపాధి హామీ పథకం కింద కూలీకి వెళ్తున్న మహిళా న్యాయవాదికి ప్రిన్సిపల్ సివిల్ జడ్జి రాధికా జైస్వాల్ సహా పలువురు సాయం అందించారు. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ రూరల్ జిల్లాలోని నెక్కొండ మండలానికి చెందిన గుండ్రాతి స్వప్న హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయవాద పట్టా పుచ్చుకుని జిల్లా కోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నారు. ప్రతిరోజూ కోర్టుకు హాజరై కేసులు చేపట్టడం ద్వారా ఆమె ఆదాయం పొందుతోంది. కరోనా ఉధృతి నేపథ్యం లో కోర్టులు బంద్ కావడం, కేసులు లేకపోవడంతో ఆమె ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో కుటుంబ పోషణ కోసం స్వప్న కొద్ది రోజులుగా ఉపాధి హామీ పథకం కింద కూలీ పనులకు వెళ్తోంది. మహిళా న్యాయ వాదిగా జనానికి అండగా నిలుస్తున్న స్వప్న కూలీ పనులకు వెళ్లాల్సిన దుస్థితిని చూసి న్యాయవాదులు చలించారు. ఈ క్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ స్పందించింది. స్వప్న పరిస్థితిని వెలుగులోకి తీసుకు రావడంతో స్వప్న ను ఆదుకునేందుకు సివిల్ జడ్జి రాధికా జైస్వాల్ సహా పలువురు ముందుకొచ్చారు. దీంతో జిల్లా కోర్టు ఆవరణ లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి నాగేశ్వర్ ఆధ్వర్యంలో న్యాయవాది స్వప్నకు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్ బార్ సోమవారం రూ.12 వేలు నగదుతో పాటు 50 కేజీలు బియ్యం అంద జేశారు. అలాగే హైదరాబాద్కు చెందిన ఖుషీ ఫౌండే షన్ హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో రూ.3 వేలుతో పాటు 25 కేజీలు బియ్యం అందించారు. సదరు స్వచ్ఛంద సంస్థ మరో ఐదుగురు జూనియర్ న్యాయ వాదులకు రూ.3 వేల చొప్పున నగదుతోపాటు 25 కిలోలు చొప్పున బియ్యం అందించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్, ఉపాధ్యక్షుడు రఘునందన్, న్యాయవాదులు చక్రవర్తి, మున్నా, బుర్ర శ్రీనివాస్ గౌడ్, మౌనిక, ఆనంద్, జీపీ కొంపెల్లి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.