Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్ఫూర్తినిచ్చేలా మొక్కల పెంపకం
- ఆదర్శవంతంగా కామారం (పీటీ) నర్సరీ గ్రీన్ బడ్జెట్ కింద 10 శాతం నిధులు సర్పంచ్ రేగా కళ్యాణి నిరంతర కృషి
నవతెలంగాణ-తాడ్వాయి
ఆ నర్సరీ ప్రకృతికి వన్నె తెచ్చేలా ఉందంటే అతిశయోక్తి లేదు. అక్కడ స్ఫూర్తినిచ్చేలా మొక్కల పెంపకం చేపట్టారు. ఈ క్రమంలో ఆ పల్లె ఆదర్శవంతంగా నిలిచింది. గ్రీన్ బడ్జెట్ కింద 10 శాతం నిధులు కేటాయించారు. ఇది మండలంలోని కామారం (పీటీ) గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన నర్సరీ పరిస్థితి. సర్పంచ్ రేగా కళ్యాణి నిరంతర కృషి ఫలితమేనన్నది అక్షరాల సత్యం.
మండలంలోని కామారం (పీటీ) గ్రామంలో ఉపాధి హామీ, పంచాయతీ నిధులతో నర్సరీని ఏర్పాటు చేశారు. పల్లె ప్రగతిలో భాగంగా మొక్కలను పెంచుతున్నారు. ఈ నర్సరీలో జామ, దానిమ్మ, మామిడి, ఉసిరి, నిమ్మ, ద్రాక్ష, బొప్పాయి, తదితర పండ్ల మొక్కలతోపాటు బిల్లా, గన్నేరు, యూకలిప్టస్, తిప్పతీగ వంటి ఔషధ మొక్కలే కాకుండా నీడ నిచ్చే వేప లాంటి మొక్కలు నాటి పెంచుతున్నారు. పర్యావరణం ఉట్టిపడేలా నర్సరీలో మొక్కల పెంపకం చేపట్టారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీ) సత్య ఆంజనేయ ప్రసాద్, ఉపాధి హామీ ఏపీఓ అనిల్, ఎంపీఓ శ్రీనివాస్ సూచనలు, సలహాల మేరకు సర్పంచ్ రేగా కళ్యాణి నర్సరీ మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటిప్పుడు అవసరమైన పనులు చేపడుతూ అభివృద్ధి చేస్తున్నారు. మండలంలో ఉత్తమ నర్సరీగా దీన్ని ఉన్నతంగా తీర్చిదిద్దారు. గ్రామానికి అవసరమైన మొక్కలు నాటారు. నర్సరీ అభివృద్ధిలో సర్పంచ్ రేగ కళ్యాణితోపాటు పంచాయతీ కార్యదర్శి రాజేందర్ భాగస్వాములయ్యారు. నీరు పోయడం, గడ్డి కోయడం లాంటి పనుల కోసం వాచర్ను నియమించారు. పంచాయతీలకు ప్రభుత్వం అందించిన ట్రాక్టర్ల ద్వారా మొక్కలకు నీరు అందిస్తున్నారు. సంరక్షకులను నియమించారు. నూతన పంచాయతీ రాజ్ చట్టంలో భాగంగా గ్రీన్ బడ్జెట్ కింద ప్రభుత్వం కేటాయించిన 10 శాతం నిధులు పచ్చదనం కోసం వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నారు. కామారం సర్పంచ్ కళ్యాణి ప్రత్యేక చొరవతో సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల కామారం పచ్చదనంతో కొత్త శోభను సంతరించుకుంది. కామారం సర్పంచ్ రేగ కళ్యాణి, పంచాయతీ కార్యదర్శి రాజేందర్, గ్రామపంచాయతీ సిబ్బందిని మండల అభివద్ధి అధికారి సత్య ఆంజనేయ ప్రసాద్, ఉపాధి హామీ ఏపీఓ అనిల్, ఎంపీఓ శ్రీనివాస్, గ్రామస్తులు అభినందించారు.