Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యారోగ్య సంఘాల ఐక్య వేదిక డిమాండ్
నవతెలంగాణ-భూపాలపల్లి
రాష్ట్రంలోని వైద్యారోగ్యశాఖ పరిధి వైద్యులు పారా మెడికల్ సిబ్బంది, వివిధ కేంద్ర, రాష్ట్ర పథకాలలో ఆశాల వరకు సుమారు లక్షమందికి పైగా పని చేస్తున్నారని, 2020 మార్చి నుండి నేటి వరకు 16 నెలలుగా కరోనాపై అవిశ్రాంతంగా పోరాడుతున్నారని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వైద్యారోగ్య సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు ఓనపాకల రాజయ్య, బొట్ల చక్రపాణి డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జేసీకి, వంద పడకల ఆస్పత్రి సూపరింటెండెంట్, డీఎంహెచ్ఓకు వినతిపత్రం అందజేసి వారు మాట్లాడారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే సుమారు 50మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది మంది కరోనాకు గురై కుటుంబాలతో సహా తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వైద్యారోగ్య శాఖ లో పనిచేస్తున్న అన్ని స్థాయిల్లోని అన్ని రకాల కేడర్లకు, ఉద్యోగుల కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులందరికీ ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ తో కూడిన 10 శాతం బెడ్స్ ప్రత్యేకంగా కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వారి కుటుంబ సభ్యులకు జిల్లా కేంద్రాలు, పట్టణ కేంద్రాల్లో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. కరోనా బారిన పడి చనిపోయిన వారికి రూ.కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, వారి కుటుంబ సభ్యుల అర్హతను బట్టి ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. కరోనా ఇన్సెంటివ్ 2020 ఏప్రిల్, మే నెల మాత్రమే 10 శాతం ఇచ్చారని, ఆ తర్వాత ఇవ్వలేదన్నారు. దీని కొనసాగించి ఉద్యోగులందరికీ ఇవ్వాలన్నారు. ఉద్యోగులపై పని భారం తగ్గించడానికి కాళీ పోస్టులు భర్తీ చేయాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వాలని, బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ బాధ్యతల వల్ల ప్రతిరోజు వైరస్ గురయ్యే ప్రమాదాన్ని నివారించడానికి రొటేషన్ పద్ధతిలో విధులు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అన్ని రకాల కాంట్రాక్ట్ డాక్టర్లు, పారామెడికల్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని కోరారు. ఆశ వర్కర్లకు పారితోషికాలకు బదులు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు వ్యాక్సినేషన్ వల్ల పారిశుధ్యం లోపిస్తున్నదని, నాలుగో తరగతి సిబ్బందిని నియమించాలనానరు. కాంటి జెన్సి వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే దశలవారీ పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ యూనియన్ల నాయకులు డాక్టర్ రవి కుమార్, టి రాజు, శ్యాం ప్రసాద్, హేమసింగ్, సతీష్, నాగిరెడ్డి, కొండ లక్ష్మి పాల్గొన్నారు.