Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మక్క పూజారి దంపతుల మృతి బాధాకరం
- సబ్‌రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ కుటుంబానికి రూ.20 వేలు సాయం
నవతెలంగాణ-తాడ్వాయి
కష్టాల్లో ఉన్న వారిని అవకాశమున్న వ్యక్తులు, సంస్థలు ఆదుకోవాలని ములు గు, భూపాలపల్లి జిల్లాల సబ్‌రిజిస్ట్రార్, సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు తస్లీమా మహ్మద్ పిలుపునిచ్చారు. మండలంలోని మేడారంలోని సమ్మక్క పూజారి సిద్దబోయిన సమ్మారావు-సృజన దంపతుల మృతి బాధాకరమన్నారు. సమ్మక్క పూజారి కుటుంబానికి సబ్‌రిజిస్ట్రార్ తస్లీమా సోమవారం రూ.20 వేలు ఆర్థిక సాయం అందించారు. పూజారి తల్లిదండ్రులతో, పిల్లలతో మాట్లాడారు. కరోనాతో సమ్మారావు-సృజన దంపతుల మృతితో వారి పిల్లలు అనాథలయ్యారని ఆందోళన వెలిబుచ్చారు. బాధిత కుటుంబానికి ట్రస్ట్ మిత్ర బందం కాళోజీ టీవీ సీఈఓ శ్రీనివాస్ దాసరి, సత్య రాపెళ్లి, టీిఎన్ఎఫ్ అరుణ క్వీన్, రమాబాయి అంబేద్కర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ సహకారంతో సాయం అందించినట్టు తెలిపారు. పూజారి పిల్లలను ప్రభుత్వం, అధికారులు సాయం అందించాలని కోరారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు స్థానికులు ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాల ఇబ్బందులను తొలగించేలా దాతృత్వం చాటాలని సూచించారు. కరోనా తగ్గిందని భావించవద్దని, ప్రతిఒక్కరూ నియంత్రణ పాటించాలని చెప్పారు. మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ వినియోగించాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను దినచర్యలో భాగంగా అలవర్చుకోవాలని కోరారు.