Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు వరి ధాన్యం విక్రయించేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. మిల్లర్ల ముందు పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిట్యాల మండల కేంద్రంలోని కైలా పూర్ శివారులో ఉన్న మహా శ్రీ వీర రైస్ మిల్లు వద్ద రైతులు వరి ధాన్యాన్ని తీసుకెళ్తే కొనుగోలు చేయడం లేదని, నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. రైస్ మిల్లు యజమాన్యం నిర్లక్ష్యంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. ఈ విషయమై మిల్లర్ల యజమాన్యం తో మాట్లాడటానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రావట్లేదని గుమాస్తాలు పేర్కొంటున్నారు. రైతులను రెండు మూడు రోజులు నిరీక్షించేలా చేసి ధాన్యం లో కోతలు విధిస్తూ దోపిడీ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి మిల్లర్ల పై చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎనిమిది రోజులుగా రైస్‌మిల్ వద్దే....
ఈనెల 1వ తేదీన చిట్యాల ఏఎంసిలో ట్రక్ రషీద్ తీసుకొని మహాబీర మిల్కు తీసుకెళ్లి ఎనిమిది రోజులుగా రైస్ మిల్లు వద్ద ఉంటున్నాం. అయినా మా బస్తాలు తీసుకోవడం లేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే అక్కడున్న గుమాస్తాలు యజమాన్యం కొనుగోలు చేయవద్దని తెలిపారని నిర్లక్ష్యంగా చెబుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు రైస్ మిల్ యాజమాన్యం పై చర్యలు తీసుకొని మా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఈ విషయమై రైస్ మిల్లర్లకు ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు.
- సురేందర్ రెడ్డి, కంచు రవీందర్, రైతులు