Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం వాహనాల పడిగాపులు లైన్లో 200 వాహనాలు
నవతెలంగాణ-మహబూబాబాద్
జిల్లాలో రైస్ మిల్లుల వద్ద ధాన్యం వాహనాలు అన్లోడ్ కోసం రెండ్రోజులు వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో అన్నదాతపై ఆర్థిక భారం పడుతోంది. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలించేందుకు 6 ఏజెన్సీలు ఏర్పాటు చేశారు. ఒక్కో ఏజెన్సీ నిర్వాహకులు 24 లారీలను సమకూర్చుతున్నారు. అవి సరిపోకపోవడంతో రైతులు సొంతంగా డబ్బులు పోగు చేసి కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు వాహనాలను ఏర్పాటు చేసుకుని ధాన్యం తరలిస్తున్నారు. సకాలంలో అన్లోడింగ్ కాకపోవడంతో రైతులపై పెను భారం పడుతోంది. రైస్‌మిల్లుల్లో పూర్తిస్థాయిలో హమాలీలు లేకపోవడం, ఉన్న వారికి పని భారం మూలంగా వాహనాలు ఆన్లోడ్ కావడం లేదు. ఒక్కో రైతు మీద 100 బస్తాల ధాన్యానికి రూ.2 వేలు భారం పడుతోంది. జిల్లావ్యాప్తంగా సుమారు 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరింది. ఇప్పటికే అధికారులు సుమారు 15 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించారు. ఇంకా సుమారు రెండున్నర లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉంది. బస్తాలు నింపి కాంటా పూర్తి చేసుకుని ధాన్యాన్ని తరలించేందుకు వాహనాలు దొరకడం లేదు. వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తుతోంది. దీంతో రైతులే వాహనాలు సమకూర్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గత్యంతరం లేక రైతులు వాహనాలను సమకూర్చుకొని తరలిస్తున్నారు. జిల్లాలో ఇంకా రెండున్నర లక్షల క్వింటాళ్ల ధాన్యం పెండింగ్‌లో ఉంది. మరోవైపు మబ్బులు కమ్ముకొస్తుండడం రైతులను భయాందోళనకు గురి చేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతుల ఆర్థికభారం భరిస్తూ ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం రవాణా కాంట్రాక్టర్ నుంచి రవాణా చార్జీలు ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.