Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన వరి ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని డీఆర్డీఓ పీడీ సంపత్‌రావు నిర్వాహకులను ఆదేశిం చారు. గురువారం మండలంలోని కాట్రపల్లి, పత్తిపాక గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి పరిశీలించారు. నిల్వ ఉన్న ధాన్యం బస్తాలను తూకం వేసి పూర్తి చేయాలని ఆదేశించారు. 17 శాతం లోపు తేమ ఉన్న ధాన్యాన్ని తూకం వేసి పంపించగా రైస్ మిల్లు వద్ద దిగుమతి ఆలస్యం కావడంతో వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తిందని, రైస్ మిల్లర్లు వాటిని తీసుకోవడంలేదని రైతులు, నిర్వాహకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన డీఆర్డీఓ పీడీ మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టాలని, తడిసిన ధాన్యం ప్రత్యేక లారీలలో పంపించాలని, మిగతా ధాన్యంతో కల్పి పంపిస్తే మిల్లర్లు అభ్యంతరాలు తెలియచేస్తారని అన్నారు. పత్తిపాక లో 4000 ధాన్యం బస్తాలు, కాట్రపల్లి లో ఆరువేల ధాన్యం బస్తాలను వెంటనే రైస్ మిల్లులకు పంపించాలని ఆదేశించారు. మరో రెండు రోజుల్లో కొనుగోలు కేంద్రాలను మూసి వేయనున్నట్టు తెలిపారు. రవాణా కాంట్రాక్టర్ అలసత్వం వల్ల లారీలు రావడంలేదని నిర్వాహకులు పీడీ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యంతో వరంగల్ లారీ అసోసి యేషన్ నుండి లారీలు వస్తున్నాయని, ధాన్యాన్ని మిల్లులకు ఎగుమతి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ రామిశెట్టి లత లక్ష్మారెడ్డి, సర్పంచులు చిట్టిరెడ్డి రాజిరెడ్డి, ఒంటేరు వనమ్మ వీరస్వామి, ఎంపీడీఓ ఆమంచ కృష్ణమూర్తి, ఏపీఎం శ్రీధర్‌రెడ్డి, ఏపీవో కీర్తి అనిత, నిర్వాహకులు పాల్గొన్నారు.