Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశావ్యాప్త నిరసనలో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన
నవతెలంగాణ-మట్టెవాడ/భూపాలపల్లి/నర్సంపేట
'ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించాలి. కరోనా బాధిత కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. కరోనాతో మృతిచెందిన ఉద్యోగ, కార్మిక కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. బాధిత కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం కరోనా టీకాల ఉత్పత్తిని వేగంగా పెంచి కార్మికులకు కార్మిక కుటుంబాలకు తక్షణమే టీకాలు ఇప్పించాలి. కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలపై కేంద్ర ప్రభుత్వం తిరుగుబాటు ఎదుర్కోకతప్పదు.' అని సీఐటీయూ వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ , సీఐటీయూ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కంపేటి రాజయ్య బొట్ల చక్రపాణి, సీఐటీయు వరంగల్ రూరల్ జిల్లా కార్యదర్శి అనంతగిరి రవి విమర్శించారు. దేశవ్యాప్త నిరసనలో భాగంగా గురువారం వరంగల్ నగరంలో కేఎంసీ, ఆర్ఈహెచ్డబ్ల్యూ, ఆటో, మున్సిపల్, ఔట్ సోర్సింగ్ కార్మికులతో కలిసిి ప్లకార్డులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే భూపాలపల్లి జిల్లాలో కార్మిక అడ్డాల వద్వ నిరసన తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో తహసిల్దార్ రాంమూర్తికి 13 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. వరంగల్ రోడ్డు కూడలీలలో ప్లకార్డులు చేతబూని నిరసన వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో వారు పాల్గొని మాట్లాడారు. కరోనా లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పో యి, ఆదాయాలు దెబ్బతిన్న కార్మికులను, ప్రజలను ఆదుకో వడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. అంబానీ, ఆదానీ సేవలో మునిగిన మోడీ ప్రభుత్వం ప్రజలను కరోనా కాటు నుంచి కాపాడటానికి ముందు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ అసమర్ధ పాలనను ఎండగట్టి ప్రజానీకాన్ని ఆదుకునేందుకు ఒత్తిడి తేవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మెతక వైఖరి అవలం భించడం సరికాదన్నారు. లాక్డౌన్, కర్ఫ్యూతో నిరుద్యోగ రేటు 14 శాతానికి చేరిందన్నారు. ఆర్థిక వనరులన్నీ గుప్పిట్లో పెట్టుకున్న కేంద్రం పేదలను, పనులు కోల్పోయిన వారిని కాపాడే బాధ్యతను విస్మరించిందన్నారు. మున్సిపాల్టీల్లో, హాస్పిటల్స్‌లో పనిచేస్తున్న కార్మికులు, సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికుల వద్దకెళ్లి ఫోటోలకు ఫోజులిచ్చి సరి పుచ్చుకోకుండా కరోనాతో మృతిచెరదిన ఔట్ సోర్సింగ్, పారిశుధ్య కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని మోడీని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మినెంట్ చేయకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే ప్రభుత్వ రంగ సంస్థలకు టీకా ఉత్పత్తి బాధ్య తను అప్పగించి అందరికీ ఉచిత టీకాలు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ఆదాయపు పన్ను పరిధిలో లేని కుటుంబాల ఖాతాలకు నెలకు రూ.7,500 నగదు బదిలీ చేయాలని, రాబోయే 6 నెలలకు ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు అందించాలని డిమాండ్ చేశారు. రూ.50 లక్షలు సమగ్ర ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించాలని, అన్ని తాత్కాలిక కేడర్లలో కరోనా కాలంలో విధి నిర్వహణలో చనిపోయిన ఉద్యోగి కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉపాధి కల్పించాలని కోరారు. కోవిడ్‌తో చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి కారుణ్యనియామకం కింద ఉద్యోగం ఇవ్వాలన్నారు. అసంఘటిత రంగం బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాబోయే మూడవ దశ కరోనాను ఎదుర్కొనేందుకు సరిపడా బెడ్స్,ఆక్సిజన్, మందులు ముందుగానే సిద్ధం చేసుకోవాలని కోరారు. కేరళ ప్రభుత్వం మాదిరిగా 16 రకాల నిత్యావసర సరుకులు రూ.7500 ఇవ్వాలన్నారు. మండల, గ్రామ స్థాయిలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో అవసరమైన సిబ్బందిని రిక్రూట్మెంట్ చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 కార్మిక కోడ్ లను, మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సంస్కరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లాలో కరోనా నేపథ్యం లో పనిచేస్తున్న ఆశ వర్కర్లు, సెకండ్ ఏఎన్ఎంలు, మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ, హమాలి, ట్రాక్టర్ డ్రైవర్, షాపు గుమస్తాలు తదితరులకు కరోనా రక్షణ పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణి, కాంట్రాక్ట్ కార్మికులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలని డిమాండ్ చేశారు. కరోనా బాధిత కాంట్రాక్ట్ కార్మికులకు వేతనం కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడాది కాలంగా కరోనా కట్టడి చర్యలకు పూనుకోకుండా ప్రధాని మోడీ దీపాలు వెలిగించండి, చప్పట్లు కొట్టండి, గో..కరోనా గో అంటూ పిలుపునిస్తూ అశాస్త్రీయత విధానాలను అవలంభిస్తూ దేశ ప్రజలను మూఢనమ్మకాల వైపు నెట్టేశాడన్నారు. మోడీ కార్పోరేట్ శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారి దేశ ఆర్థిక పరిస్థితిని దివాల తీశాడని విమర్శించారు. ప్రపంచ దేశాలు మొదటి దఫా కరోనాతో గుణపాఠం నేర్చుకొని సెకండ్ వేవ్ కరోనాను అధిగమించేందుకు ప్రయత్నిస్తుండగా భారత్‌లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేయకుండా ఆర్థిక ప్యాకేజీ ఇవ్వకుండా ప్రజా జీవనాన్ని ఇబ్బందులకు గురి చేశాడని దుయ్యపట్టారు. దేశ ప్రజలందరికి వ్యాక్సిన్ ఇవ్వకుండా కంపెనీలకు లాభాలు తెచ్చిపెట్టేందుకు ఇతర దేశాలకు ఎగుమతి చేసుకొనేందుకు అనుమతినిచ్చిందని ఆరోపించారు. మరో వైపు మూడవ సారి కరోనా అతి ప్రమాదకరంగా రాబోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారని, దీని నుంచి రక్షించేందుకు కేంద్రం వెంటనే ప్రతి పౌరుడికి ఉచితంగా వ్యాక్సిన్ అందించే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణాల్లోనూ ఉపాధి హామీ పథకం కొనసాగించాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. వరంగల్‌లో ప్రభాకర్ రెడ్డి, ముక్కెర రామస్వామి, నాగరాజు, సాదిక్, సర్వర్ రాజమని, మంద సంపత్, భూపాలపల్లిలో వివిధ సంఘాల నాయకులు వంగాల రామస్వామి, కొండ లక్ష్మి, శేఖర్, ఆనందం ,లక్ష్మి, మదనమ్మ, రాజేందర్ రాజేశ్వరి రవి, భిక్షపతి ,రాధ బాబు, నర్సంపేటలో సీఐటీయు నాయకులు గుజ్జుల ఉమా, కందికొండ రాజు, జగన్నాథం, కార్తీక్, పాలకుర్తి మధు, హంపి రవి, జెట్టి మధు, కొత్తగట్టు నాగరాజు,సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.