Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు
- రైతులను మోసం చేస్తే పీడీ యాక్ట్ : డీఎస్పీ
నవతెలంగాణ-తొర్రూరు
వర్షాకాలం పంటల సాగు సమయం దగ్గర పడుతోంది. మరోపక్క ఇదే అదనుగా నకిలీ విత్తనాల వ్యాపారులు దొడ్డిదారిన విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం రావడంతో అధికారులు ఫర్టిలైజర్ దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నారు. తక్కువ ధరకు విత్తనాలు లభిస్తున్నాయని ఆశపడి రైతులు దళారుల వద్ద కొనుగోలు చేసి మోసపోవద్దని అధికారులు అంటున్నారు. అధికారుల సలహాలు, సూచనల మేరకు వర్షాకాల పంటల విత్తనాలను కొనుగోలు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. డివిజన్లోని పలు మండలాల్లో నకిలీ విత్తనాల వ్యాపారులపై కేసులు నమోదు కావడంతో మండల వ్యవసాయ శాఖ, పోలీసులు అప్రమత్తమయ్యారు.
విత్తనాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!
వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి. రాత్రి సమయాల్లో గ్రామాల్లో విత్తనాలు విక్రయించే వారి నుంచి కొనుగోలు చేయొద్దు. బీజీ-3 పేరుతో చలామణి అవుతున్న హెచ్‌టీ పత్తి విత్తనాలకు జీఈఏసీ అనుమతి లేని క్రమంలో వాటి విక్రయం, సాగు నేరం. కొనుగోలు చేసిన దుకాణం నుంచి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. రసీదు బిల్లుపై విత్తన కంపెనీ, రకం పేరు, తయారీ, గడువు తేదీ, డీలర్ సంతకం ఉండాలి. నిర్ణీత ఫార్మాట్లో ఉన్న బిల్లు మాత్రమే అంగీకరించాలి. లూజుగా ఉన్న సంచులు, పగిలిన ప్యాకెట్లు, డబ్బాలో నుంచి ఇచ్చే విత్తనాలు కొనొద్దు. కొనుగోలు చేసిన విత్తన ప్యాకెట్లు, సంచి, డబ్బాలపై సీల్‌ను సరి చూసుకోవాలి. విత్తన ప్యాకెట్లపై ముద్రించిన సమాచారాన్ని బిల్లులోని సమాచారంతో పరిశీలించాలి. బీటీ కాటన్ విత్తన ప్యాకెట్లపై జీఈఏసీ నెంబర్, తేదీ, రాష్ట్రంలో సాగు చేయుటకు అనువైనదో కాదో తెలిపే సమాచారం చూడాలి. విత్తన ప్యాకెట్‌ను, బిల్లును పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపర్చాలి. తద్వార జన్యు, స్వచ్ఛత లోపాలతో లేదా మొలక శాతం తక్కువైతు పరిహారం కోరే హక్కు ఉంటుంది.
రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి
కుమార్ యాదవ్, వ్యవసాయ అధికారి
ఫర్టిలైజర్ దుకాణాల నుంచి పత్తి, మిర్చి, వరి, కంది ఇతర విత్తనాలు కొనుగోలు చేస్తే రసీదు పొందాలి. నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు. వ్యవసాయ శాఖ అధికా రుల సలహాలు, సూచనల మేరకే విత్తనాలు కొనుగోలు చేయాలి. లేకుంటే నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది.
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్
వెంకటరమణ, డీఎస్పీ
రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తాం. ఫర్టిలైజర్ దుకాణాల్లో వారం రోజులుగా విత్తనాలను, ఎరువులను పరిశీలి స్తున్నాం. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాల మేరకు విత్తనాలు కొనుగోలు చేయాలి.