Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపురం
కరోనా వైరస్ పచ్చని పల్లెలను కలవర పెడుతోంది. రెండో దశ గ్రామాల్లో విజృంభిస్తోంది. గిరిజన గ్రామాల్లో బాధితులు పదుల సంఖ్యల్లో వెలుగులోకి వస్తున్నారు. పల్లెల్లోనూ కంటైన్మెంట్ జోన్లు వెలుస్తున్నాయి. అధికారులు మండల కేంద్రాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తున్నారు.
కరోనా కేసులు-మరణాలు
మారుమూల ఏజెన్సీ మండలాలైన వాజేడు, వెంకటాపురంల్లో కరోనా కేసు లు, మరణాలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. వెంకటాపురం మండలంలో 830 కరోనా కేసులు నమోదు కాగా 483 మంది కోలుకున్నారు. అలాగే 345 యాక్టివ్ కేసులుండగా ఇద్దరిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు. 13 మంది మృతి చెందారు. వాజేడు మండలంలో ఇప్పటివరకు 1102 కరోనా కేసులు నమోదు 644 మంది కోలుకున్నారు. మరో 442 మంది కరోనా వైరస్‌తో పోరాడుతుండగా 16 మంది మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
కంటోన్మెంట్ జోన్లు
వెంకటాపురం, వాజేడు మండలాల్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగు తుండడంతో వెంకటాపురంలోని వాడగుడెం, బెస్తగుడెం, ఆలుబాక, మర్రిగుడెం, బోదాపురం, ఎదిర యాకన్నగుడెం, మండల కేంద్రంలోని జక్కులవారి వీధి, శివాలయం వీధి, వాజేడు మండలంలో గణపురం, బోల్లారం, రేగులపాడు మోతుకులగుడెం, చెరుకూరులను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. మూడు వారాల పాటు సంతను రద్దు చేశారు. ప్రభుత్వం లాక్డౌన్ సమయాన్ని సడలించినా ఈనెల 19 వరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే తెరవాలని పంచాయితీ పాలక వర్గం తీర్మానించింది.
ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు
వెంకటాపురం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలోని 4 గదుల్లో 40 పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కరోనా బాధితులను ఐసోలేషన్ కేంద్రాలకు తరలించేందుకు శుక్రవారం తహసీల్దార్ అంతటి నాగరాజు, ఎస్సై తిరుపతి, సర్పంచ్‌లు గిరిజన గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు.
కంటైన్మెంట్ జోన్లపై నియంత్రన కరవు
కంటైన్మెంట్ జోన్లపై అధికారుల నియంత్రణ కరువైంది. కంటైన్మెంట్ జోన్లలో అధికారులు రోడ్డుకు అడ్డంగా మూడ్రోజుల క్రితమే కంచెలు ఏర్పాటు చేశారు. 14 రోజుల వరకు ఇండ్ల నుంచి ఎవరూ బైటకు రావద్దని కోరారు. అయినా అడ్డంకులను తొలగించి జనం తిరుగుతున్నారు. ఈ క్రమంలో కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశముందని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా అధికారులు కంటైన్మెంట్ జోన్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.