Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య
నవతెలంగాణ-జఫర్ఘడ్
కౌలు రైతులకు 2011 చట్టం ప్రకారం రుణ అర్హత కార్డులివ్వాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ వీరస్వామికి శుక్రవారం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడారు. జూన్ 1 నుంచి వానాకాలం పంటలు సీజన్ ప్రారంభమైందని, ఇప్పటికే కొన్ని చోట్ల మెట్ట పంటలు వేశారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు వ్యవసాయ, రుణ ప్రణాళిక విడుదల చేయకపోవడం సరికాదన్నారు. రైతులు విత్తనాల కోసం ఆందోళనకు గురౌతున్నారని చెప్పారు. కల్తీ విత్తనాల బెడద నివారించాలని అధికారులను ఆదేశించిన ప్రభుత్వం వాయిదాల్లో రుణ మాఫీ చేయడం వల్ల రైతులు బ్యాంకుకు బాకీ ఉంటుండడంతో కొత్తగా పెట్టుబడుల కోసం అప్పులు దొరకడం లేదన్నారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు అందని పరిస్థితి ఉందని ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ధరల నియామక సంఘాలను ఏర్పాటు చేసిన ఉత్పత్తిని శాస్త్రీయంగా లెక్కించి దానికి 50% కలిపి మద్దతు ధర చెల్లించాలని ఆకాంక్షించారు. వ్యవసాయ యంత్రాలు కొనుగోలు చేయడానికి సన్న, చిన్నకారు రైతులకు 60 శాతం, ఎస్సీ ఎస్టీలకు 90 శాతం సబ్సిడీ ఇవ్వాలని, రైతు బీమా పథకాన్ని 18 నుంచి 70 ఏండ్ల రైతులకు వర్తింపజేసి ఈ ఏడాది ఆగస్ట్ నుంచి ప్రభుత్వం ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు నక్క యాకయ్య, కాటా సుధాకర్, వెన్నకూస నాంపల్లి, యాదగిరి, యాదమ్మ, రాజు, దేవేందర్ పాల్గొన్నారు,
పాలకుర్తి : తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ హరి ప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య మాట్లాడారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న, శ్రీనివాస్, బొంకూరు నర్సయ్య, రాజు, సమ్మయ్య పాల్గొన్నారు.
వెంకటాపురం : రైతు సంఘర ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ రాముకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్టెం ఆదినారాయణ మాట్లాడారు. కార్యక్రమంలో వంకా రాములు, సత్యం, నాగేశ్వరరావు, సున్నం నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.
గోవిందరావుపేట : రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ రమాదేవికి సంఘం మండల కార్యదర్శి నాగిరెడ్డి వినతిపత్రం అందించి మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గుండు రామస్వామి, నాయకులు పులుగుజ్జు వెంకన్న, కట్ట వెంకటేశ్వర్రావు, నిమ్మల భిక్షం, గుండు లెనిన్ పాల్గొన్నారు.
తాడ్వాయి : రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ ముల్కనూర్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం వెంకట్‌రెడ్డి మాట్లాడారు. సమస్యలను వివరించారు. కార్యక్రమంలో వ్యకాస జిల్లా నాయకుడు చిట్టిబాబు పొదిల, చెన్నూరి నర్సయ్య, చింతల రఘుపతి, బండ సారయ్య, తదితరులు పాల్గొన్నారు.