Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
జిల్లా ప్రజలున పట్టించుకునే నాథుడే కరువయ్యాడని సామాజిక ప్రజాస్వామిక వేదిక జిల్లా అధ్యక్షుడు చల్ల లింగయ్య అన్నారు. వేదిక నియోజకవర్గ అధ్యక్షుడు కోరె రవి అధ్యక్షతన జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన సమావేశానికి లింగయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పిన నాయకులు జనం అనారోగ్యంతో మృతి చెందుతున్నా పట్టించుకోవడం లేదని చెప్పారు. భూ, ఇసుక, మద్యం వ్యాపారాలకు నాయకులు పరిమితమయ్యారని మండిపడ్డారు. ప్రజల బాగోగులను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పల్లెల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ధారావత్ దేవానాయక్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్‌కే పరిమితమయ్యారని మండిపడ్డారు. ప్రజాసమస్యలను గాలికొదిలారని చెప్పారు. సమావేశంలో వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కోరె రవి, ఉపాధ్యక్షుడు మేకల సంజీవరావు, ఎంహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు యాకయ్య, వేదిక మండల అధ్యక్షుడు కారం ప్రవీణ్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు ఎలిమి రాంచందర్, భరత్, తదితరులు పాల్గొన్నారు.