Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
వరంగల్ సెంట్రల్ జైల్ కూల్చివేత ముమ్మరంగా సాగుతోంది. శని వారం తెల్లవారుజామున మొదలైన కూల్చివేత పనులు సిబ్బంది, సామగ్రి తరలింపు కారణంగా కొద్దిసేపటి తర్వాత నిలిచినటు సమాచారం. ఆదివారం ఉదయం నుంచి మాత్రం వేగంగా జరుగుతున్నాయి. కూల్చి వేతలను పరిశీలించేందుకు మీడియాకు, జైల్ సిబ్బందికి గాని అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. ఓ స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుందని వార్తలు వచ్చిన కొద్ది గంటల్లోనే జైలు అధికారులు శుక్రవారం రాత్రే ఆగమేఘాల మీద ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ వద్దకు వెళ్లి జైలు స్థలాన్ని అప్పగిస్తున్నట్లు లేఖ అందిచండం విశేషం. కూల్చివేతలకు సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పటి వరకు జైల్ అధికారులు విడుదల చేయలేదు. వరంగల్ జైలు కూల్చివేత ప్రక్రియలో అధికారులు అనుసరిస్తున్న గోప్యత అర్థం కానీ రీతిలో ఉండటం గమనార్హం. మీడియాను సైతం అనుమతించకుండా జైలు గేట్లు మూసేసి భారీ బందోబస్తు మధ్య కూల్చివేత లను కొనసాగిస్తున్నారు. కేఎంసీ నుంచి వరంగల్ వైపు రోడ్డును క్లోజ్ చేసేశారు. ఎంజీఎం సెంటర్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసా గిస్తున్నారు. జైల్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోల్ బంక్‌ను సైతం క్లోజ్ చేయడం విశేషం. సెంట్రల్ జైల్లో కూల్చివేతలు జరుగుతుంటే రోడ్డుపై కూడా నిర్బంధాలు ఎందుకంటూ జనం మండిపడుతున్నారు. అసలు కూల్చి వేత విషయాన్ని ఎందుకంత గోప్యంగా ఉంచుతున్నారో అధికారులకే తెలియాలంటూనే, వారిది అర్థం లేని వైఖరి అంటూ జనాలు తప్పు పడుతున్నారు