Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్రాజం
నవతెలంగాణ-జనగామ
జిల్లాలో మూడు నెలలుగా జాతీయ ఉపాధి హామీ పనులు చేస్తున్న దళిత , గిరిజన పేద కూలీల పట్ల వివక్షత వహిస్తూ కూలీ డబ్బులు చెల్లించక పోవడం దారుణమని వ్యవసాయకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఏలూరి వెంకట్రాజం ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద ప్లకార్డులు పట్టుకుని కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిది వారాలు గా ఎస్సీ, ఎస్టీ వ్యవసాయ కార్మికులు ఉపాధి పనుల్లో పని చేస్తున్నప్పటికీ బిల్లులు రాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. ఏడాది పొడవునా జీతాలు తీసుకుంటూ నాలుగు నెలలు పనులు చేయించే సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి వచ్చిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటినుండీ పేదల పట్ల నిర్లక్ష్యంగావ్యవహ రిస్తున్నదని అన్నారు. సమస్య పరిష్కారానికి అవసరమైతే న్యాయ స్థానానికి వెళ్లనున్నట్టు తెలిపారు. వారం రోజుల్లోగా ఎస్సీ, ఎస్టీలకు కూలీ డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సింగారపు రమేష్, ఉపాధ్యక్షులు యు రవి , పోత్కనూరి ఉపేందర్, నాయకులు ఎం మల్లయ్య, లక్ష్మి నరసింహరెడ్డి, బి నరసింహ, గుగులోతు మీట్యా, బొడ కుమార్ తదితరులు పాల్గొన్నారు.