Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
కళాకారులకు చేయూతనిచ్చి జీవన భృతి కల్పించాలని శరపంజరం మూవీ దర్శకులు, మిమిక్రీ కళాకారుడు గట్టు నవీన్ కోరారు. ఆదివారం తొర్రూర్ పట్టణ కేంద్రంలో కళాకారులతో కలిసి ప్లకార్డులతో నిరసన తెలిపి ఆయన మాట్లాడారు. కరోనాతో కళాకారుల జీవితాలు విషాదంగా మారాయని అన్నారు. రెండేండ్లుగా ప్రదర్శనలు లేక, సంపాదన లేక కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారిందన్నారు. నటుడు కస్తూరి పులెందర్ మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో కళాకారుల ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని, ప్రభుత్వం స్పందించి కళాకారులకు ఆర్థిక సహాయమందించాలని కోరారు. శ్రావణ్ ఈవెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ మిమిక్రీ కళాకారుడు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో మంది చేతి వృత్తుల వారికి వివిధ పథకాల ద్వారా సహాయం అందించిందని, కళనే వృత్తిగా జీవనం సాగించే కళాకారులను కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు. కళాకారులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, కోవిడ్ బారిన పడ్డ కళాకారులకు మెరుగైన వైద్యం అందించాలని, కళాకారులకు వ్యాక్సిన్లు త్వరగా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ మార్గం సతీష్, మహేష్ చంద్ర, సింగర్ రాహుల్ పాషా, జితేంద్ర, వివేక్ భోగ, దిలిప్, రమేష్, రేగొండ రామకృష్ణ పాల్గొన్నారు.