Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కానరాని 'పల్లె ప్రగతి'
- నిధులు మంజూరైనా నాన్చుతున్న వైనం
- చిత్తడిగా మారుతున్న మట్టి రోడ్లు
- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-పర్వతగిరి
మండలంలోని ఇస్లావత్ తండా గ్రామ పంచాయతీలోని అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి మట్టి రోడ్లు చిత్తడిగా ఏర్పడ్డాయి. తండావాసులు నడకకే నానా అవస్థలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సొంత మండలంలోని గ్రామాల పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలోని పల్లెలో అభివద్ధి ఏ మేరకు జరిగిందో అర్థం చేసుకోవచ్చనీ తండావాసులు పెదవివిరుస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్ అయినా కూడా గ్రామా ల్లో జరుగుతున్న అభివద్ధి పనులపై దష్టి సారించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తండాలోని రోడ్ల నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.8లక్షలు మంజూరైనా సీసీ రోడ్డు నిర్మాణానికి అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు చొరవ చూపడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై స్థానిక సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా రోడ్ల నిర్మాణం తమ పరిధిలో లేదని, జెడ్పీ నిధులు మంజూరు చేసిన ఎక్కడ ఆగి పోయిందో తెలియదని చెప్పారు. మండల అధికారులను సంప్రదించగా అసలు అంతర్గత రోడ్ల విషయంలో తమకు ఎటువంటి వివరాలు తెలియదని స్పష్టం చేశారు. అభివద్దే తమ ధ్యేయమని పలికే నాయకుల ఊకదంపుడు మాటలే తప్పా ఆచరణలో కానరావడం లేదని మండల ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికైనా తండాల్లోని అంతర్గత, మట్టి రోడ్లను సీసీ రోడ్లుగా నిర్మించడానికి ప్రభుత్వ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని తండావాసులు కోరుతున్నారు.