Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో బెంగాల్ తరహా తీర్పే..
- ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
నవతెలంగాణ-వరంగల్
ఆస్తులను కాపాడుకోవడానికి, కేసుల నుంచి తప్పించుకోవడానికే మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరినట్లు కనిపిస్తోం దని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు. హన్మకొండలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో కడియం మాట్లాడారు. బీజేపీలో చేరిన నాడే 'ఈటల'కు పరాభవం జరిగిందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆధ్వర్యంలో చేరాల్సిన 'ఈటల' కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో చేరడమే అందుకు నిదర్శనమన్నారు. కేవలం సీఎం కేసీఆర్ను ఎదుర్కొనడానికే 'ఈటల' బీజేపీలో చేరినట్టు ఉందన్నారు. విద్యార్థి దశలో 'ఈటల'లో వామపక్ష భావాలుండవచ్చని కమ్యూ నిస్టు, సోషలిస్టు అని చెప్పుకున్న ఆయన బీజేపీ లో చేరినప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీజేపీలో నచ్చిన సిద్ధాంతం ఏంటో చెప్పాలని కోరారు. బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని ప్రశ్నించారు. విభజన చట్టంలోని కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు బీజేపీ ముందుకొచ్చిందా ? అని ప్రశ్నించారు. బీజేపీ ఎజెండాలో పేదల సంక్షేమానికి సంబంధించిన అంశాలు ఏమైనా వున్నాయా ? అని ప్రశ్నించారు. బీజేపీ కులాలు, మతాలపై ఆధారపడి రాజకీయాలు చేస్తుందే తప్పా ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని కాదన్నారు. ఉన్నపళంగా లాక్డౌన్ విధిస్తే లక్షలాది మంది వలసకూలీలు వందల కిలోమీటర్లు కాలినడకన వెళ్తుంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వాళ్లను ఆదుకుందా ? ఇది 'ఈటల'కు కనిపించలేదా ? అని ప్రశ్నించారు. బలహీనవర్గాల అభ్యున్నతికి 7 ఏండ్లలో ఒక్క సంక్షేమ పథకమైనా బీజేపీ ప్రభుత్వం ప్రకటించిందా? అని ప్రశ్నించారు. 'ఈటల'కు భయం పట్టుకోవడం వల్లే బీజేపీలో చేరారన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు తనవెంటే ఉన్నారని చెబుతున్న 'ఈటల' ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేయలేకపోయారని ప్రశ్నించారు.
అసైన్డ్ భూములు ఎందుకు వాపస్ చేయలే..?
తన భూముల్లో అసైన్డ్ భూములున్నాయని, వాటిని రెండు, మూడు చేతులు మారాక కొనుగోలు చేశానని ఒప్పుకున్న 'ఈటల' అవి చట్టవ్యతిరేకమని తెలిసినా ఎందుకు ప్రభుత్వానికి వాపస్ చేయలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ను రాచరిక ఫ్యూడల్ మనస్తత్వమని విమర్శించిన 'ఈటల'కు రాజరిక ఫ్యూడల్ మనస్తత్వం బీజేపీలో కనిపించలేదా ? అన్నారు. వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు, గడిలాంటి ప్యాలెస్ ఉన్న ఈటల సోషలిస్టు, కమ్యూనిస్టు భావాలు కలిగి ఉంటాడని ప్రశ్నించారు. ఈటలలోనూ ఫ్యూడల్ లక్షణాలున్నాయని చురుకు పెట్టారు.