Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి
నవతెలంగాణ-ములుగు
వర్షాకాలంలో సీజన్లో వ్యాధులు ప్రబల కుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరెట్ నుంచి అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కోవిడ్ నిబంధనల అమలుపై సమీక్షించారు. వైద్యం, ఆరోగ్యం, హరితహరం, పారిశుధ్యం, పన్ను సేకరణ, సీసీ ఛార్జీలు, తదితరాలపై తహసీల్దార్లకు సూచనలు చేశారు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, తదితర వ్యాధులను నివారించడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. మురుగు కాల్వల్లో నీరు నిల్వకుండా, కాల్వల్లో పూడికతీసి మురుగు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. పల్లపు ప్రాంతాల్లోని వర్షపు నీరు చెరువులు, కుంటలోకి వెళ్లేలా కాల్వలను తవ్వించాలని సూచిం చారు. పల్లపు ప్రాంతాలో ఇంకుడు గుంతలు తవ్వి నీటి నిల్వ చేసి భూగర్భ జలాలు పెంచేలా ఏర్పాట్లు చేయాలన్నారు. రక్షిత మంచినీటి చర్యలు తీసుకోవాలని, నీటి సరఫరాకు ముందు క్లోరినేషన్ లెవెల్స్ సరి చూసుకోవాలని, నీటి సరఫరాలో లీకేజీ లేకుండా చూడాలని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్వో రమాదేవి, జిల్లా పరిషత్ సీఈఓ ప్రసన్నరాణి, డీపీఓ వెంకయ్య, తహశీల్దార్ సత్యనారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.