Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఫ్ఆర్ఓ కోట సత్తయ్య
- అటవీ భూమిలో హరితహారానికి ఏర్పాట్లు
నవతెలంగాణ-తాడ్వాయి
మండలంలో హరితహారం కార్యక్రమం ప్రారంభం కావడంతో పోడు రైతుల్లో అభద్రతాభావం నెలకొంది. అటవీ శాఖకు అందుబాటులో ఉన్న స్థలానికి మించి లక్ష్యాలు నిర్ణయించడంతో అనధికారికంగా అడవిని నరికి సాగు చేసుకుంటున్న పోడు రైతులపై అటవీ శాఖ అధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగా తాడ్వాయి ఎఫ్ఆర్వో కోట సత్తయ్య సిబ్బందితో బీరెల్లి గ్రామపంచాయతీ పరిధి లోని ఆశన్నగూడ, ఎల్లాపూర్ అటవీశాఖ పరిధిలో పంబాపూర్, అంకంపల్లి, ఆశన్న గూడ, ఎల్లాపూర్ గ్రామాల్లోని పోడు భూముల్లో ఆదివాసీ గిరిజనులు అనధికారి కంగా పోడు చేసుకుంటున్నా భూమికి వెళ్లి హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు సన్నద్దం చేస్తున్నారు. ఇది గమనించిన పంభాపూర్, అంకంపల్లి, ఆశన్నగూడ ఎల్లాపూర్ గ్రామాల ఆదివాసీ గిరిజనులు పోడు భూముల వద్దకు చేరుకుని అనేక ఏండ్లుగా పోడు వ్యవసాయం చేసుకుని బతుకుతున్నట్టు తెలి పారు. తమను ఇబ్బందులకు గురి చేయొద్దని ఎఫ్ఆర్ఓ సత్తయ్యను కోరారు. పోడు వ్యవసాయం చేయకపోతే బతకలేమని, భూమి తమకు ఇవ్వాలన్నారు. కొత్త పోడు కొట్టమని, పాత పోడును వదిలి పెట్టమని చెప్పారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ సత్తయ్య రైతులతో మాట్లాడారు. చెట్టు నరకాలంటే అనుమతి పొందాలని, ఆ స్థానంలో ఐదు మొక్కలు నాటాలని చెప్పారు. అడవులను నరకడం వల్ల పర్యావరణం పాడైపోతుందని తెలిపారు. వర్షాలు సమయానికి కురువవని అడవుల ఆవశ్యకత గురించి తనదైన రీతిలో ఆదివాసి గిరిజనులకు వివరించారు. మొక్కలు నాటిన ప్లాంట్లో స్థానిక ఆదివాసి గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నచ్చజెప్పారు. దీంతో ఆదివాసీ గిరిజనులు భూమి కోల్పోయినంత మేరకు వేరే రకంగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన రైతులు ఫారెస్ట్ సెక్షన్, బీట్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.