Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూములను లాక్కునేలా సీఎం కుట్ర కాంగ్రెస్ హయంలో పట్టాలు
- ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-ములుగు
పోడు భూముల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ హయంలో పోడు భూములకు హక్కు పత్రాలివ్వగా టీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతో లాక్కునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. నియోజకవర్గంలో పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, రైతులపై దాడులు చేస్తూ భూముల చుట్టూ ట్రెంచ్ కొడుతున్నారని ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల సమయంలో పోడు భూములకు పట్టాలిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడేండ్లు గడిచిన పట్టాలివ్వకపోగా హరితహారం పేరుతో భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. బడ్జెట్ సమావేశములో పోడు భూములకు పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని నిలదీస్తే సీఎంతో మాట్లాడతానని సంబంధిత మంత్రి హామీ ఇచ్చి ఇప్పటివరకు స్పందించక పోవడం బాధాకరమన్నారు. ఫారెస్ట్ అధికారుల దాడులను ఆపాలన్నారు. లేనిపక్షంలో పెద్దఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బాణోత్ రవిచందర్, మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య, మైల జయరాంరెడ్డి, జాడి వెంకటేశ్వర్లు, గంగారాం జెడ్పీటీసీ ఈసం రమ, సహకార సంఘం వైస్ చైర్మెన్ మర్రి రాజు, సర్పంచ్ అంకిరెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి అజ్జు, తదితరులు పాల్గొన్నారు.