Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల వ్యవసాయ అధికారిని ఉషాదయాల్
నవతెలంగాణ- న్యూశాయంపేట
వానాకాలం పంటల సాగు మొదలైంది. ఈ సారి రుతుపవనాలు సకాలంలో వచ్చాయి. రైతులు విత్తనాలు, ఎరువుల కోసం దుకాణాల బాటపడుతున్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చే రైతుబంధు డబ్బులు కూడా రైతుల అకౌంట్లలో పడ్డాయి. ఇక సాగు విధానాల్లో మెలుకు వలు రైతుల సందేహాలు, వానాకాలం సాగుకు సంబం ధించి పూర్తి అవగాహన రైతులకు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల వ్యవసాయ అధికారిని ఉషా దయాల్‌ను నవతెలంగాణ పలకరించింది. వివరాలు ఆమె మాటల్లోనే...
వ్యవసాయ సాగు ఎలా ? రైతులకు అవగాహనేమైనా కల్పించారా ?
వరంగల్ అర్బన్ జిల్లాలో 1,92,086 ఎకరాలు, రూరల్ జిల్లాలో 3,77,096 ఎకరాలు పంట సాగుచేయన్నున్నట్లు అంచనా. వానకాలం సీజన్ ముందు వేసవిలో లాక్ డౌన్ నేపథ్యంలో పంటల సాగుపై ప్రత్యక్షంగా రైతులకు అవగాహన కల్పించలేదు. వాట్సాప్, జూమ్, పత్రికల ద్వారా సాగు సమాచారాన్ని అందిస్తున్నాం.
నియంత్రిత సాగు విధానం ఉందా ?
ఈసారి నియంత్రిత సాగు విధానం లేదు. వరిలో ఆయా ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు సాగుభూమి పరిస్థితిని బట్టి సన్నరకం, దొడ్డురకాలు ఎంపిక చేసుకోవాలి. పచ్చి రొట్ట విత్తనాలను 65 శాతం రాయితీపై ఇస్తున్నాం. వరి, మొక్కజొన్న, పప్పుధాన్యాల విత్తనాలకు ఈసారి రాయితీ లేదు. రైతుల బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాలి. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా లో 11 లక్షల పత్తి విత్తనాల సంచులు, వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి
ప్రస్తుతం ఎరువుల నిల్వలు ఉన్నాయా ?
జులై వరకు పంటల సాగుకు అవసరమైన ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా లో 1033 టన్నుల యూరియా, 1239 టన్నుల డీఏపీ 4383 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 7400 టన్నుల యూరియా, డి ఏ పి 633 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 6561 టన్నులు అందుబాటులో ఉన్నాయి.
వానాకాలం సీజన్లో ఏ పంటలు ఎప్పుడు వేయాలి ?
వాన కాలంలో పత్తి పంటను ఇప్పటినుండి జూలై 15 వరకు, మొక్కజొన్న జూలై 15 వరకు కంది మినుము పెసర పంటలను కూడా జూలై 20 లోపు వేయాలి. వరిలో రకాలకు సంబంధించి దీర్ఘకాలిక రకాలను ఈ నెల 20వ తేదీ వరకు, మధ్యకాలిక రకాలను జూలై 10 వరకు, దొడ్డు రకం వరిలో స్వల్పకాలిక రకాలను జూలై 31 వరకు నార్లు పోయాలి. అన్ని రకాల వరినాట్లను ఆగస్టు మొదటి వారం వరకు పూర్తి చేయాలి. సన్న రకాల్లో సిద్ధి (డబ్లూ జీ ఎల్ 44), వరంగల్ సాంబ (డబ్ల్యూ జి ఎల్ 14), వరంగల్ సన్నాలు, తెలంగాణ సోనా, సోమనాథ్ ,సాంబమసూరి, జైరాం అనువైనవి. దొడ్డు రకాల్లో కూనారం సన్నాలు ,బతుకమ్మ ,జగిత్యాల రైస్ కాటన్ దొర ,వరంగల్ రైస్ (1) విజేత రకాలు అనువైనవి.
నకిలీ విత్తనాలు, పురుగు మందుల్ని ఎలా గుర్తించాలి?
నకిలీ విత్తనాలు పురుగుమందులను గుర్తించడానికి క్యూ ఆర్ విధానాన్ని అమల్లోకి తెచ్చాం. విత్తనాలు ఎరువులు, పురుగు మందుల ప్యాకింగ్ పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కానింగ్ చేస్తే సంబంధిత కంపెనీ పేరు, విత్తనం స్వచ్ఛత తదితర పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి. వాటి ద్వారా నకిలీవి గుర్తించవచ్చు.
పత్తి,కంది పంటల సాగునే ఎందుకు ప్రోత్సహిస్తున్నారు?
పత్తి పంట ఈ ప్రాంత భూములు,వాతావరణానికి అనుకూలం. పత్తి పంట ఉత్పత్తులను అంతర్జాతీయంగా ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంది. దీంతో ధరలు నిలకడగా ఉంటాయి. పెట్టుబడి కూడా గ్యారెంటీగా ఉంటుంది. రైతులకు కూడా ఈ పంట సాగుపై పూర్తి అవగాహన కలిగి ఉన్నారు. పెట్టుబడి గ్యారెంటీ పంట కావడంతో రైతులు ఈ పంట వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇక కంది ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉంటుంది. ధర కూడా నిలకడగా ఉంటుంది. ఈ పంటల సాగుతో భూసారం కూడా పెరుగుతుంది.
మిరప సాగుకు తీసుకునే మెలకువలేంటీ ?
మిరప పంటకు కూడా గిట్టుబాటు ధర నిలకడగా ఉంటుంది. నారును జూలైలో పోసుకోవాలి. పంట ముందు పొలంలో పచ్చిరొట్ట పంటలు జీలుగా పెసర విత్తనాలు వేసుకోవాలి. పంట పూత సమయంలో పొలంలో మొక్కల్ని కలియదున్నాలి. దీంతో భూసారం పెరిగి ఎరువుల వాడకం తగ్గుతుంది.